Summer Special : మామిడిపండ్లలో ఎన్ని రకాలో.. ఎన్ని రుచులో.. మిస్ కాకుండా తినండి..!

Summer Special : మామిడిపండ్లలో ఎన్ని రకాలో.. ఎన్ని రుచులో.. మిస్ కాకుండా తినండి..!

సీజన్ వేసవి వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. పచ్చి లేదా పండు మామిడి తిని 'ఆహా ఏమి రుచి!' అని అనకుండా ఉండలేరు. అంతేకాదు మామిడిలో పోషక విలువలు కూడా ఎక్కువే.

మామిడి రుచులు.. వేసవి వేడిని కూడా మరిపిస్తాయి. ఆ రంగు రుచి మధురాతి మధురం. అయితే ఈ మామిడి పండ్లలో చాలా రకాలున్నాయి.. మార్కెట్ లో అమ్మకందారు ఏవేవో పేర్లు చెప్పి.. పండ్లను మన చేత కొనిపించేస్తారు.. అసలు ఆ పండ్లు ఏంటో... వాటి రుచి ఎలా ఉంటుందో ఇవన్నీ తెలిసినప్పుడే మామిడిని మరింత ఆస్వాదించొచ్చు. 

ఎన్ని రుచుల్లో

మామిడి పండ్లలో మీకు తెలిసిన రకాలెన్ని అని అడిగితే మాత్రం ఓ ఐదారు పేర్లు టక్కున చెప్పేస్తాం. పెద్దవాళ్లని అడిగితే మరికొన్ని మామిడి రకాల పేర్లు చెప్తారు. పేర్లయితే చెప్తారు గానీ అవి ఎలా ఉంటాయంటే మాత్రం కన్ఫ్యూజన్ తప్పదు. అందుకే మార్కెట్ లోకి పండ్లు కొనడానికి వెళితే చాలామంది ఏదోరకం పండును కొని తెచ్చేసుకుంటారు. అయితే మన దేశంలో దాదాపు 300 రకాల రుచికరమైన మామిడి పండ్లు దొరుకుతున్నాయంటే... ప్రపంచవ్యాప్తంగా 1100 రకాలకు పైగా మామిడి పండ్లున్నాయి.

రుచి ప్రియులు

బంగినపల్లి, రసాలు, చిన్నరసాలు, పెద్దరసాలు, చెరుకు రసాలు, నూజివీడు రసం, అల్ఫాన్నో, ఇమామ్పసంద్, చందూర, రుమానియా, మల్లోవా, చక్కెర కుట్టి, జలాలు, ముంత మామిడి, షోలాపురి, కొబ్బరి మామిడి, కొండ మామిడి, చౌంసా, అంగ్రా, కేసర్... అని బోలెడు రకాల మామిడి పండ్లు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నా అందరూ ఇష్టంగా తినే పండు బంగినపల్లి. అన్ని పండ్లకంటే ఎంతో రుచిగా ఉండే ఈ పండ్లకి గిరాకీ ఎక్కువే! పసందైన రుచితో రాజులు, చక్రవర్తులను సైతం ఆకట్టుకున్న ఘనత మామిడికి దక్కింది. ఒక్కో మామిడి ఒక్కో ప్రాంతానికి చెందినా భారతీయుల రుచి ప్రియుల అవ్వడంతో ఇవి మిగతా ప్రాంతాల్లోనూ ప్రాముఖ్యత పొందాయి. మన దేశంలో కనిపించే మామిడి రకాలు మరే ఇతర దేశంలోనూ కనిపించవు. విదేశాల్లోనూ ఎన్నో రకాల పళ్లు అందుబాటులో ఉన్నా మన మామిడి రుచికి ఫిదా అయిన విదేశీయులు ఎక్కువే. అందుకే మామిడి పండ్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. మన రాష్ట్రం నుంచి ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి, నీలమ్, రసాలు, జలాలు, కొబ్బరి మామిడి ఎగుమతి ఎక్కువ.

బంగినపల్లి

మార్కెట్లో లో మొదట హిట్ కొట్టే మామిడి రకం బంగినపల్లి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ్లు విరివిగా కాస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు కూడా ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ఈ పండుపై తొక్క ముదురు పసుపు రంగులో మెరిసిపోతుంటుంది. కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఈ పండ్లు నోరూరిస్తాయి. 

కాస్త ఉప్పు, కారం

అన్ని రకాల మామిడి పండ్లతో పోలిస్తే తోతాపురి పండ్లను గుర్తించడం చాలా సులువు. కింద వైపు అంటే షార్ఫ్గా.. బిలకముక్కులా ఉంటుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఈ పండ్లు విరివిగా కాస్తాయి. మిగతా మామిడి పండ్లలాగా ఈ పండ్లు అంత తియ్యగా ఉండవు. కాకపోతే కాస్త ఉప్పు, కారం చల్లుకొని తింటే మాత్రం రుచిగా ఉంటాయి. అంతేకాదు మామిడితో తయారు చేసే కొన్ని ఉత్పత్తుల కోసం ఈ పండ్లను ఎక్కువగా వాడతారు. 

రసాలు

ఇవన్నీ ఒక ఎత్తయితే చేతులకీ, మూతులకూ రాసుకుంటూ రసాన్ని ఆస్వాదించగలిగేవి. రసాలు, చెరుకు రసాలు, నూజివీడు రసాలు, చిన్నరసాలు, పెద్దరసాలు, సువర్ణరేఖ, పంచదార..వంటివన్నీ మాత్రం తెలుగు రాష్ట్రాలకే సొంతం. ఎందుకంటే ప్రపంచదేశాలతో పాటు మనదేశంలోని ఇతర ప్రాంతాల్లో తినేవన్నీ ముక్కలు కోసుకుని తినాల్సిందే మరి. 

కేసర్

కేసర్ మామిడి చూడగానే ఆకట్టుకుంటుంది. నాణ్యతలో కూడా ఈ పండుకి మంచి మార్కులే పడతాయి. ఈ పండు రుచి ఎంతో బాగుండటమే కాకుండా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది కూడా. గుజరాత్, మహారాష్ట్రలో మామిడి పండ్లలో ఉండే విరివిగా పండుతుంది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో కేసీర్ మామిడికి క్రేజ్ ఎక్కువ. మీడియం సైజ్ లో, దీర్ఘచతురస్రాకారంలో ఉండే కేసర్ మామిడి పండు తల భాగంలో ఎరుపు రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. రుచి కూడా కాస్త భిన్నం.

సువాసనల రారాజు

మే నుంచి జులై వరకు దొరికే నీలమ్ పండ్లను సువాసన పండ్ల రారాజుగా పిలుస్తారు. సీజన్ మొత్తం దొరికే ఈ పండ్లలో..జూన్లో దొరికేవి మరింత
టేస్టీగా ఉంటాయి. తొలకరి సమయంలో పండ్లు హైదరాబాద్లోనే ఎక్కువగా
దొరుకుతుంటాయి. కాకపోతే అన్ని దేశాల్లో కూడా ఈ మామిడి పండ్ల తోటలున్నాయి. పలుచగా తొక్క ఉండే ఈ పండు ఆరెంజ్ రంగులో మెరిసిపోతుంటాయి.

 ఖరీదైనది కూడా

పండ్లకు రాజు మామిడి అయితే ఆ మామిడి రకాల్లో రారాజు అల్బానో, మార్చి నుంచి జులై వరకు కాసే ఈ రకం రుచిలోనే కాదు, ఖరీదైనదిగానూ పేరొందింది. మహారాష్ట్ర, గుజరాత్, రాష్ట్రాల్లో ఎక్కువగా పండే ఈ రకం మామిడిలో టెంకను పాతితే కచ్చితంగా అదే రకం మామిడి మొలకెత్తకపోవడమే దీని ప్రత్యేకత.

పండ్లన్నింటీలో రుచికరమైనవి 

ఒక చెట్టుకి కాసిన కాయలే ఒక్కతీరున ఉండవే... ఇక వేల రకాల మామిళ్లన్నీ ఒకే రుచితో ఎలా ఉంటాయి కచ్చితంగా ఉండవు. అందుకే మామిడి పండ్లన్నింటిలోకీ రుచికరమైనది. ఏమిటా అని ఈ మధ్య గిన్నిస్బుక్ వాళ్లు ఆరా తీశారు. దక్షిణ భారతానికి చెందిన బాదామి, తేనె మామిడిగా ప్రాచుర్యం పొందిన పాకిస్థానీ సింధ్, పసుపు రంగులోనే కాసే థాయ్ నామ్ మాయ్,, తీపికే మారుపేరైన ఫిలిప్పీన్స్ స్వీట్ ఎలినా , గుయ్ మారాస్ మామిడి రకాలు ప్రథమ స్థానంలో నిలిచాయి.

 మాటల్లో చెప్పగలమా!

తేనెకన్నా తీయని కమ్మదనం. నోరూరించే పులుపు మామిడి సొంతం. ఈ రెండు రుచుల్లో రెండు వందలకు పైగా మామిడిపండ్లు మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. పిండి వంటలు, పులుసులు, పచ్చళ్లు, సలాడ్స్, జ్యూస్ ఐస్క్రీం, లస్సీ, కేకులు, కుకీలు, ఆమ్ చూర్, హల్వా, కూరలు, మామిడి తాండ్ర అబ్బో ఇలా ఒక్కటేమిటి మామిడిలో బోలెడన్ని వెరైటీలు ట్రై చేయొచ్చు. ఇక ఆవకాయ అయితే ఆల్ టైం ఫేవరెట్. వేడివేడి అన్నానికి కాస్త నెయ్యి తగిలించి అమ్మచేత్తో ఆవకాయ రుచి చూస్తే... ఎంత కమ్మగా ఉంటుంది. ఆ రుచి మాటల్లో చెప్పగలమా!

విటమిన్ లూ పుష్కలం..

  • మామిడి పండులో ఫైబర్,ప్రోటీన్స్, విటమిన్-ఎ, సి, బి6, ఇలతో పాటుకాపర్ పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. మామిడి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తాయి, రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. ఈ పండులోని విటమిన్ సి, ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి.
  • విటమిన్- ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి. పచ్చి మామిడితినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. 
  • మామిడి పండును తినడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. చర్మ సమస్యలు పోతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • మూత్రపిండాలలో రాళ్ళున్నవారు ఒక గ్లాసు మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే రాళ్ళు కరిగిపోతాయి.
  • చిగుళ్ల ఇన్ఫెక్షన్, రక్తం కారడం, దంతాల నొప్పి సమస్యలతో బాధపడే వాళ్లు మామిడి పండుని తింటే ఫలితం ఉంటుంది. దీంతో నోట్లోని బ్యాక్టీరియా వశించడమే కాదు. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వాళ్లకి ఇది మేలు చేస్తుంది. 
  • మామిడి పండులో శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే బీటా కెరటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం బలోపేతం అవుతుంది.