పరిశ్రమలు తెచ్చి.. ఉద్యోగాలు కల్పిస్త: గడ్డం వంశీకృష్ణ

పరిశ్రమలు తెచ్చి.. ఉద్యోగాలు కల్పిస్త: గడ్డం వంశీకృష్ణ

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ఆ పార్టీ దళితుల ద్రోహి అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బ్రిటిష్​పాలన తరహాలో విభజించు, పాలించు అన్నట్టుగా దళితుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఫైర్ అయ్యారు. ఎమ్మార్పీఎస్, యాదవ కులసంఘం నేతలతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. కాకా వెంకటస్వామి బాటలో ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ ఉపకులాల కోసం పని చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్​తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. 

మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్స్ లోనూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిరుద్యోగ సమస్య నిర్మూలనే నా మెయిన్ ఎజెండా. ఇందుకోసం ప్రభుత్వ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా’’ అని ప్రకటించారు. పెద్దపల్లి ప్రాంతానికి సాగునీరు అందించేందుకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి పత్తిపాక రిజర్వాయర్ కట్టించే బాధ్యత తీసుకుంటానన్నారు. 

 కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల స్కాం చేసిన గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందన్నారు. పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి పెన్షన్ స్కీం తెచ్చారన్నారు. పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపించాలని, ఇంట్లో చిన్న కొడుకుగా భావించి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.