సికింద్రాబాద్ కాజీపేటకు త్రీ, ఫోర్ రైల్వే లేన్.. బోర్డుకు DPR పంపిన దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్ కాజీపేటకు త్రీ, ఫోర్ రైల్వే లేన్.. బోర్డుకు DPR పంపిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్​నుంచి కాజీపేట వరకు మూడు, నాలుగు రైల్వే లేన్ల​నిర్మాణానికి త్వరత్వరగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు డీపీఆర్​రెడీ చేసి రైల్వే బోర్డుకు పంపించారు. సికింద్రాబాద్– కాజీపేట మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి ఇదివరకే రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 

ఈ రూట్​110 కి.మీ. దూరం ఉండగా, సుమారు రూ. 2,837 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్ఎల్ఎస్​) 2023లోనే పూర్తయ్యింది. డీపీఆర్​కూడా రెడీ చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు 8 నెలల క్రితం రైల్వే బోర్డుకు సమర్పించారు. ప్రస్తుతం బోర్డు పరిశీలనలో ఉందని, అతి త్వరలోనే దీనికి సంబంధించి అనుమతులు వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు ప్రకటించారు.  

ఈ రూట్ ​ఎంతో కీలకం..

ప్రాజెక్టులో భాగంగా సమీప సెక్షన్​అయిన కాజీపేట-– విజయవాడ, కాజీపేట-– బల్లార్షా, సికింద్రాబాద్–-వాడి రూట్లను ట్రిప్లింగ్, ఫోర్​లేన్లుగా మార్చడానికి అధికారులు నిర్ణయించారు. దీంతో సికింద్రాబాద్​– -కాజీపేట మధ్య కూడా ట్రిపుల్, ఫోర్​లైన్​తప్పనిసరైంది. అంతేగాకుండా అధికారులు సికింద్రాబాద్–​-కాజీపేట రూట్​ను కీలకంగా భావిస్తున్నారు. ఈ రూట్​లో ఇప్పుడు డబుల్​ లేన్​మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసే రైళ్లు ఈ రూట్​లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. 

ముఖ్యంగా ఢిల్లీ, కోల్​కతా, చెన్నై వెళ్లే రైళ్లు ఈ మార్గంలోనే వెళ్తాయి. సెంట్రల్​అండ్​ఈస్ట్రన్​రీజియన్ల నుంచి ముఖ్యంగా కర్నాటక, తెలంగాణ, ఏపీ, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ ఈ రూట్​లోనే ప్రయాణిస్తుంటాయి. సింగరేణి కాలరీస్​ నుంచి బొగ్గు రవాణా, సిమెంట్, స్టీల్, ఇండిస్ట్రియల్​గూడ్స్​ తీసుకువెళ్తుంటారు. ఈ రైళ్లన్నీ ఇప్పుడు డబుల్​లేన్​కారణంగా సిగ్నళ్ల కోసం వేచి ఉంటున్నాయి. త్రీ, ఫోర్ లేన్స్​పూర్తయితే ఈ సమస్యలన్నీ తప్పుతాయని అధికారులంటున్నారు. 

ఆ రూట్​లో ఇప్పటికే పూర్తి..

ప్రస్తుతం సికింద్రాబాద్-–కాజీపేట రూట్​ డబుల్​ లేన్​గా ఉంది. అయితే, ఇప్పటికే మౌలాలి-ఘట్​కేసర్ ​మధ్య మూడో, నాలుగో లైన్​ పూర్తయ్యింది. అలాగే, ఘట్​కేసర్​-– యాదాద్రి మధ్య ఎంఎంటీఎస్ ​రెండో ఫేజ్​ కోసం మూడో లైన్​ పనులు కొనసాగుతున్నాయి. దీంతో రాయిగిరి, కాజీపేట మధ్య ట్రిపుల్​ లేన్‎తో పాటు ఫోర్​లేన్, ఘట్​కేసర్​–యాదాద్రి మధ్య 4వ లేన్​పనులు  చేపట్టనున్నారు. ఘట్​కేసర్​ నుంచి కాజీపేట వరకు 16 స్టేషన్లు నిర్మించనున్నారు. ఆయా పనులను నాలుగేండ్లలో పూర్తి చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఆర్​వోబీలు, మరో 27 రోడ్​అండర్​బ్రిడ్జిలను కూడా ఈ సెక్షన్​ పరిధిలో నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు.