ముగ్గురికి ‘పొన్నం సత్తయ్య’ జీవిత సాఫల్య పురస్కారాలు...కోదండరెడ్డి, వెలిచాల కొండలరావు, గొట్టే కనకవ్వ ఎంపిక

ముగ్గురికి ‘పొన్నం సత్తయ్య’ జీవిత సాఫల్య పురస్కారాలు...కోదండరెడ్డి, వెలిచాల కొండలరావు, గొట్టే కనకవ్వ ఎంపిక
  • ఈ నెల 13న రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం 

హైదరాబాద్, వెలుగు: మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారకార్థం ఏటా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారాలకు ఈసారి ముగ్గురు ప్రముఖులను ఎంపిక చేశారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, సాహిత్య రంగంలో రచయిత వెలిచాల కొండలరావు, కళారంగంలో జానపద గాయని గొట్టే కనకవ్వకు అవార్డులు దక్కాయి. గత నాలుగేండ్లుగా సాహిత్యం, కళారంగాల్లో పురస్కారాలు అందజేస్తుండగా.. ఈ ఏడాది నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా చేర్చారు.

డా. పొన్నం రవిచంద్ర కన్వీనర్‌‌గా ఉన్న జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేసింది.  ఎంపికైన వారి జాబితాను ట్రస్టు చైర్మన్ పొన్నం ప్రభాకర్‌‌కు అందజేశారు. పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటలకు రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఒక్కొక్కరికి రూ.50 వేల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. వివిధ రంగాల్లో సమాజానికి సేవలందించిన ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడమే ట్రస్టు లక్ష్యమని ఉపాధ్యక్షుడు పొన్నం అశోక్‌‌గౌడ్‌‌ తెలిపారు.