జీడిమెట్ల, వెలుగు: ఎక్స్ట్రా చట్నీ వేయలేదన్న కోపంతో టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిపై ఓ వ్యక్తి కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్ర సమీపంలో రామేశ్వర్ శివాజీ సకారే అనే వ్యక్తి ‘జైభవానీ’ పేరుతో టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గోషామహల్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాడు.
ఈ క్రమంలో టిఫిన్ సప్లై చేస్తున్న ప్రథమేశ్‌ను శంకర్ ఎక్స్ట్రా చట్నీ అడగగా.. అతడు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గమనించిన టిఫిన్ సెంటర్ యజమాని రామేశ్వర్ వారిద్దరినీ వారించడానికి వెళ్లగా, తీవ్ర ఆగ్రహానికి గురైన శంకర్ అక్కడే కౌంటర్‌పై ఉన్న కూరగాయలు కోసే కత్తిని తీసుకొని ఆయనపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో యజమానికి తీవ్ర గాయాలు కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
