తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.
ప్రస్తుతం ( 2026 ఏప్రిల్ 27న) ఉచిత దర్శనం కోసం సుమారు 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 4 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. టోకెన్ తీసుకున్న సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
ఇక నిన్న ( 2026 ఏప్రిల్ 26) స్వామివారిని 79 వేల 878 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 33 వేల 037 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల నుంచి స్వామివారి హుండీకి భారీగా కానుకలు అందాయి. నిన్న హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.

