V6 News

Tollywood Theatres Issue: సినిమా థియేటర్లకు రెంటల్, పర్సంటేజ్ విధానం అంటే ఏంటి?

Tollywood Theatres Issue: సినిమా థియేటర్లకు రెంటల్, పర్సంటేజ్ విధానం అంటే ఏంటి?

రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూ, లేకపోతే మే 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా, వాటిలో దాదాపు 150 హైదరాబాద్‌లో నడుస్తున్నాయి.

ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో పర్సంటేజీ విధానం అమలులో ఉండగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం రెంటల్ విధానం కొనసాగుతోంది. దీనివల్ల తాము తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని ఎగ్జిబిటర్లు, ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ పేర్కొంది. ఇప్పటికే నగరంలోని 23 థియేటర్ల ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే సినిమాల రిలీజ్ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్3 నుంచి అమలు చేస్తున్నారు. .

రెంటల్, పర్సంటేజీ విధానం అంటే ఏంటి?

ప్రస్తుత తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ లేదా పర్సంటేజీ(మినిమమ్ గ్యారంటీ) విధానంపైనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తున్నాయి. ఇందులో థియేటర్ యజమాని ముందుగానే ఒక ఫిక్సుడ్​అమౌంట్​ను డిస్ట్రిబ్యూటర్​కు చెల్లించి సినిమా ప్రదర్శన హక్కులు పొందుతాడు.

సినిమా హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా ఈ మొత్తం డిస్ట్రిబ్యూటర్​కు వెళ్లిపోతుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్‌కు, ప్రొడ్యూసర్ కు భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, థియేటర్ యజమానికి మాత్రం రిస్క్ ఉంటోంది. కలెక్షన్లు తగ్గినా, ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఎగ్జిబిటర్లు లాస్​అవుతున్నారు.

మల్టీప్లెక్సుల్లో మాత్రం పర్సంటేజీ (షేర్) విధానం అమలు చేస్తుండడంతో సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒక నిర్దిష్ట శాతంలో పంచుకుంటున్నారు. కానీ, సింగిల్​స్క్రీన్​ థియేటర్లకు ఇది వర్తింపజేయడం లేదు.

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబై, ఢిల్లీ, నార్త్ ఇండియా మార్కెట్లలో పర్సంటేజీ విధానం అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. తమ పెట్టుబడులు భారీగా ఉంటాయని, ఈ పర్సంటేజీ విధానం వల్ల తమ డబ్బుల రికవరీ కష్టమవుతుందని అంటున్నారు. 

ఈ నెల 30 లోగా నిర్ణయం తీసుకోకపోతే.. 

మార్చి11న బెంగళూరులో దక్షిణ భారత ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల సింగిల్ స్క్రీన్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తుండడంతో ఇక్కడ కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని తీర్మానించారు. ఇప్పటికే నగరంలోని 23 థియేటర్ల యాజమాన్యాలు పర్సంటేజీ విధానం అమలు చేస్తేనే సినిమాలు వేస్తామని, లేకపోతే వేసేది లేదని డిమాండ్​చేసి సాధించుకున్నాయి.

వీరు మొదటి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం వసూళ్ల వాటా పొందుతున్నారు. దీంతో మిగతా ఎగ్జిబిటర్లు కూడా తమకూ ఇదే వర్తింపజేయాలని పోరాడుతున్నారు. ఈ నెల 30లోగా షేర్​విధానం అమలు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని, టికెట్ ధరల నియంత్రణ, పన్నులు, విద్యుత్ చార్జీలపై సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు.