V6 News

అనంతపురం హనీ ట్రాప్ కేసులో సీఐ, ముగ్గురు పోలీసులు డిస్మిస్

అనంతపురం హనీ ట్రాప్ కేసులో సీఐ, ముగ్గురు పోలీసులు డిస్మిస్

అనంతపురం: ఏపీలో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో సీఐ, ముగ్గురు పోలీసులను డిస్మిస్ చేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. మరో సీఐని కర్నూలు డీఐజీకి అటాచ్ చేశారు. అనంతపురం రేంజ్ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలా నాయక్ను సర్వీసు నుంచి తొలగించారు. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, అదే స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్ను సస్పెండ్ చేశారు. 

అనంతపురం రూరల్ సీఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను రిమాండ్కు పంపారు. నిందితుల నుంచి రూ.13 లక్షలు, 2 కత్తులు, 6 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఇంకా కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హనీట్రాప్ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉండడాన్ని అనంతపురం డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్ తీవ్రంగా పరిగణించారు. భారీ స్థాయిలో బాధితులు రావడం, ముఖ్యంగా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉండటంతో పాటు అక్రమాలు నిర్ధారణ కావడంతో అనంతపురం డీఐజీ, ఎస్పీ చర్యలకు సిద్ధం కావడం గమనార్హం. హనీ ట్రాప్ కేసులో ఇప్పటి వరకూ మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు పడింది.

అసలు ఈ హనీ ట్రాప్ కేసు ఏంటంటే..
అనంతపురం జిల్లాలో భారీ 'హనీ ట్రాప్' ముఠా గుట్టురట్టయిన సంగతి తెలిసిందే. మహిళలను ఎరగా వేసి, సంపన్నులను ట్రాప్ చేసి లక్షల రూపాయలు గుంజుతున్న ముఠా వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో సామాన్య నేరస్తులే కాకుండా, రక్షణగా ఉండాల్సిన పోలీసు అధికారులే నిందితులకు సహకరించడం సంచలనంగా మారింది. ఈ కేటుగాళ్లు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతారు. ముందుగా ఒక మహిళను పని ఉందంటూ బాధితుల వద్దకు పంపిస్తారు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేస్తారు.

రేప్ కేసు పెడతామని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తారు. భయపడి డబ్బు ఇవ్వకపోతే, తమకు తెలిసిన పోలీసుల ద్వారా పంచాయితీలు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా రూ. 10 లక్షలు, ఓ జ్యోతిష్యుడిని బెదిరించి రూ. 5 లక్షలు వసూలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది.