కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలె

కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ  చేయించాలె

పంప్‌‌హౌస్‌‌ల నష్టాన్ని మేఘానే భరించాలి: కోదండరాం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, ప్రజాధనం దుర్వినియోగంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో మునిగిపోయిన పంప్‌‌హౌస్‌‌ల నష్టాన్ని మేఘా సంస్థ యాజమాన్యమే భరించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, అవినీతిపై విచారణ చేయించాలనే డిమాండ్‌‌తో శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ స్టేట్ ఆఫీసులో రణ దీక్షను కోదండరాం చేపట్టారు. ‘‘ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు.. ఇది తిప్పిపోతల ప్రాజెక్టు అయ్యింది. కరెంటు బిల్లులు అడ్డగోలుగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.లక్షా 20 వేల కోట్లు ఆగం చేశారు. సీఎం కేసీఆర్, మేఘా కృష్ణా రెడ్డి.. నాణేనికి బొమ్మాబొరుసులాంటి వాళ్లు. ప్రాజెక్టు కట్టకముందే ఎన్నోసార్లు డిజైన్ మార్చొద్దని చెప్పాం. కానీ కమీషన్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి కట్టింది” అని ఆరోపించారు.

క్లౌడ్ బరస్ట్ అంటూ చేతగాని మాటలు

కాళేశ్వరం నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీ వాడామని గొప్పలు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని కోదండరాం ప్రశ్నించారు. క్లౌడ్ బరస్ట్ అని, ప్రకృతి వైపరీత్యం అని చేతగాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం స్థలమైతే.. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్​ ఫెయిల్ అయ్యారన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం స్పందించి వరద బాధితులకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.