కోల్‌కతా: బెంగాల్‌లోని హౌరా జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశాడనే ఆరోపణలపై టీఎంసీ స్థానిక నాయకుడిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి గుండు గీసి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మమతా బెనర్జీ హయాంలో హౌరా జిల్లాలోని అమర్దహా గ్రామానికి చెందిన టీఎంసీ నాయకుడు సన్నాశి మన్నా, ప్రభుత్వ ప్రయోజనాలను ఇప్పించేందుకు లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీఎంసీ నాయకుల అక్రమ వసూళ్లపై జనం తిరగబడుతున్నారు. గతంలో వసూలు చేసిన ‘కట్ మనీ’ తిరిగిచ్చేయాలని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే సన్నాశి మన్నాపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సొమ్ము తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అతడి ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సంబంధించిన పలు గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డులు లభ్యమవ్వడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
సన్నాశి మన్నాను పట్టుకొని నడిరోడ్డుపై కూర్చోబెట్టి గుండు గీశారు. అనంతరం చెప్పుల దండ వేసి వీధుల్లో తిప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సన్నాశి మన్నాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ బాధితుడిని ఆందోళనకారుల నుంచి రక్షించామని, స్థానికులు చేసిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
