ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత

ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత

హైదరాబాద్ : సినిమా ఇండస్ర్టీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో  గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.  రెండు రోజుల క్రితమే సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.కొంతకాలం నుంచి అనారోగ్యంతో చలపతిరావు బాధపడుతున్నారు. దీంతో నటనకు దూరంగా ఉంటున్నారు. విషయం తెలియగానే సినీ నటులు చలపతిరావు  ఇంటికి చేరుకుంటున్నారు. చలపతిరావు భౌతిక కాయాన్ని సందర్శించి.. నివాళులర్పిస్తున్నారు.


బుధవారం అంత్యక్రియలు..

అర్థరాత్రి గుండెపోటుతో తమ తండ్రి చనిపోయారని చలపతిరావు కుమారుడు రవిబాబు తెలిపారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కాలనీలో కుమారుడు రవిబాబు ఇంట్లో ఉంటున్నారు. ఆయన కుమార్తె అమెరికా నుండి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం (ఈనెల28న) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శన కోసం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత చలపతిరావు పార్ధివ దేహాన్ని ఫిల్మ్ నగర్  మహాప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచనున్నారు.

1944 మే 8న  కృష్ణా జిల్లా బల్లిపర్రులో మణియ్, వియ్యమ్మ దంపతులకు చలపతిరావు జన్మించారు. చలపతిరావుకు ఒక కుమారుడు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు. 

చలపతిరావు కుమార్తెలు యూఎస్ లో ఉన్నారని తెలుస్తోంది. వారు వచ్చిన తర్వాతే చలపతిరావు అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.

నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. 1966లో ‘గూడచారి 116’ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు.

సీనియర్‌ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్‌ రాముడు, అక్బర్‌ సలీమ్‌ అనార్కలి, భలే కృష్ణుడు, సరదా రాముడు, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలి పులి, చట్టంతో పోరాటం, దొంగ రాముడు, అల్లరి అల్లుడు, అల్లరి, నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్‌.. ఇలా ఎన్నో వందల చిత్రాల్లో చలపతిరావు కీలకపాత్రలు పోషించారు.  గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు.