ధర ఎక్కువ.. తీపి​ తక్కువ

ధర ఎక్కువ.. తీపి​ తక్కువ
  • నాలుగో వంతుకు పడిపోయిన దిగుబడి
  • అకాల వర్షాలకు ఆలస్యంగా పూత, కాత
  • పక్వానికి రాకముందే మార్కెట్‌‌కు కాయలు
  • మోతాదుకు మించి కెమికల్స్ వాడి మగ్గబెడుతున్న వ్యాపారులు

90 రోజుల్లోనే తెంపేసి..
మామిడి పండు అంటేనే తీపికి మారుపేరు. రేటు ఎక్కువైనా సరే తినకుండా ఉండలేరు. దీంతో ప్రస్తుతం కిలోకు రూ.150 దాకా పెట్టి జనం కొంటున్నారు. కానీ ఏమాత్రం టేస్ట్​ఉంటలేవు. నోట్లో వేసుకోగానే తేనెలా కరిగిపోవాల్సిన పండ్లు.. పుల్లగా, వగరుగా ఉంటున్నాయి. దీంతో మామిడి ప్రియులు షాక్ అవుతున్నారు. కాయలు చెట్టుపై కనీసం100 నుంచి 125 రోజుల వరకు ఉంటేనే పక్వానికి వస్తాయని, అప్పుడు తెంపి మగ్గిస్తే మామిడి పండ్ల రంగు, రుచి బాగుంటాయని హార్టికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ ఈసారి ఆలస్యంగా పూతపట్టిన కాయలు చెట్లపై కనీసం 90 రోజులు కూడా లేవు. ఈ లోపే మామిడి పండ్ల సీజన్​రావడం, దిగుబడి లేక డిమాండ్ పెరగడంతో వ్యాపారుల ఒత్తిడి మేరకు రైతులు కాయలు తెంపి మార్కెట్‌‌కు తరలిస్తున్నారు. సరిగ్గా ఎదగని కాయలను కృత్రిమ పద్ధతుల్లో మగ్గబెట్టి అమ్మడంతో తీపి, రసం రావట్లేదని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. 

(వెలుగు, నెట్​వర్క్)
ఎండాకాలంతోపాటే వస్తది మ్యాంగో సీజన్. రసాలూరే పండ్లను తింటుంటే ఆ మజాయే వేరు. పండ్లలో రారాజైన మామిడి టేస్ట్ అట్లుంటది మరి. కానీ ఈ సారి వాటిని ‘కొనలేం.. తినలేం’ అన్నట్లున్నది పరిస్థితి. పండ్ల రేట్లేమో పెరిగిపోయినయ్.. తింటే టేస్ట్ ఉండటం లేదు. మామిడి తొక్క మాత్రమే పసుపు రంగులో ఉంటున్నది తప్ప.. తియ్యటి రుచి మాత్రం రావడం లేదు. నాలుకకు సయిస్తలేదు. వగరు, పులుపుగా ఉంటున్నాయి. చక్కెర పోసి జ్యూస్ చేసుకుంటున్నా రుచి రావడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే ఇలా జరుగుతోందని హార్టికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. తుఫాన్లు, అకాల వర్షాల వల్ల మామిడి పూత, కాత లేట్ అయిందని, ఇది మామిడి సీజన్‌‌పై ప్రభావం చూపిందని అంటున్నారు. కానీ వ్యాపారులు ఇవేమీ పట్టించుకోవడం లేదని, ప్రతి ఏటా మాదిరే సీజన్‌‌ను ఫాలో అవుతున్నారని, కాయలను పక్వానికి రాకముందే తెంపుతున్నారని పేర్కొంటున్నారు. కృత్రిమంగా కాల్షియం కార్బైడ్‌‌తో మాగబెడుతున్నరని, అందుకే పండ్లు పైకి మెరుస్తున్నా తియ్యగా ఉండటం లేదని చెబుతున్నారు.

సీజన్ లేట్.. దిగుబడి 20 శాతమే
రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ప్రధానంగా బంగినపల్లితోపాటు హిమాయత్, కేసరి, సువర్ణ రేఖ, తోతాపురి తదితర 17 రకాల వెరైటీలను రైతులు సాగుచేస్తున్నారు. ఏటా సగటున 10 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి నాలుగో వంతు అంటే 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశముందని హార్టికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. వాతావరణంలో మార్పుల వల్లే ఈసారి దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. అక్టోబర్‌‌, నవంబర్‌‌ నెలల్లో తుఫాన్ల ప్రభావం, అకాల వర్షాల వల్ల పూత లేట్‌‌ అయింది. వర్షాకాలం తర్వాత మామిడికి కొంత డ్రై పీరియడ్‌‌ కావాలి. కానీ వర్షాలు చాలా రోజులు కొనసాగడంతో గాలిలో తేమ శాతం పెరిగింది. దీంతో పూత జనవరి, ఫిబ్రవరిలో వచ్చింది. రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో భారీగా తేడా ఉండడంతో ఫ్లవరింగ్‌‌ దెబ్బతిన్నది. పూత వచ్చినా పిందె పట్టకుండా కాడె మాత్రమే మిగిలింది. ముందుగా ఫ్లవరింగ్‌‌ వచ్చిన ప్రాంతాల్లో మాత్రమే పిందెలు నిలబడ్డాయి. ఆలస్యంగా పూత వచ్చిన ప్రాంతాల్లో పిందెలు వేడి వాతావరణంలో పసుపు రంగుగా మారి రాలిపోయాయి. దీంతో దిగుబడి తగ్గిపోయి మార్కెట్‌‌లో డిమాండ్ పెరిగింది. వ్యాపారులు రేట్లు పెంచేశారు. బంగినపల్లి రకం గతేడాది మార్కెట్‌‌లో కిలో రూ.40 లోపుఉండగా, ప్రస్తుతం రూ.100 నుంచి రూ.150 మధ్య అమ్ముతున్నారు.

నిబంధనలు పాటిస్తలే
పక్వానికి రాకముందే మార్కెట్‌‌కు వస్తున్న కాయలను పండించేందుకు వ్యాపారులు చాలాచోట్ల నిషేధిత సోడియం కార్బైడ్ వాడుతున్నారు. ఇది దొరకని చోట్ల ఇథిలీన్‌‌ను మోతాదుకు మించి ఉపయోగిస్తున్నారు. ఫుడ్​ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) నిబంధనల ప్రకారం మామిడి, బొప్పాయి కాయలను సహజ రీతిలో పక్వానికి వచ్చేలా ఇథిలీన్ ఉపయోగించవచ్చు. కాయలను ఇథిలీన్​ గ్యాస్​ చాంబర్లలో ఉంచి, పండించడం ఒక పద్ధతి. సాచెట్ల రూపంలో ఉన్న ఇథిలీన్​ ప్యాకెట్లను 5 నుంచి 10 సెకన్ల పాటు నీటిలో ముంచి తీసి వాటిని పండ్ల మధ్యలో ఉంచడం మరోపద్ధతి. కానీ ఇథిలీన్ ప్యాకెట్లను నేరుగా కాయలకు తగలకుండా చూడాలి. ఒక ప్లాస్టిక్​ బాక్సులో ఉంచి కార్టన్​ బాక్సులను సీల్ చేయాలి. కానీ వ్యాపారులు మాత్రం దాదాపు 15 కిలోల మామిడి కాయలను మూడు లేయర్లుగా బాక్సుల్లో పేరుస్తూ, వాటి మధ్యలో కనీసం 8 సాచెట్లను నేరుగా వేస్తున్నారు. ప్లాస్టిక్​ బాక్సుల్లో మాత్రమే సాచెట్లను పెట్టాలన్న నిబంధనను గానీ, సాచెట్లను ఉపయోగించడానికి ముందు కనీసం 5 సెకన్ల పాటు నీటిలో ముంచి తీయాలన్న రూల్ నుగానీ పట్టించుకోవడం లేదు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు, ఎఫ్ఎస్​ఎస్​ఏఐ రూల్స్ ప్రకారం 5 కిలోల కాయలు మగ్గించేందుకు 0.5 మిల్లీ గ్రాముల ఇథిలీన్​ ను ఉపయోగించాలి. కానీ 3 గ్రాములున్న ప్యాకెట్లను కనీసం ఎనిమిది వరకు ఉపయోగిస్తుండడంతో ఆ కెమికల్​ప్రభావం పండ్లపై పడుతోంది. మంచి రంగుతో నిగనిగలాడుతూ కనిపిస్తున్నా తీపి ఉండడం లేదు. ఫుడ్​సేఫ్టీ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో జనాలకు రుచిపచి లేని మామిడి పండ్లే దిక్కవుతున్నాయి.

ముందే తెంపడం వల్లే..
మామిడి కాయలను పక్వానికి రాక ముందే కోసి, కృత్రిమంగా పండించడం వల్ల టేస్ట్ ఉంటలేవు. ఈ సీజన్‌‌లో మామిడి చెట్లకు పూత, కాత ఆలస్యంగా వచ్చాయి. అదే సమయంలో వైరస్‌‌లు, తెగుళ్ల వల్ల దిగుబడి పడిపోయింది. అందువల్ల మిగిలిన పంటకు చాలా డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు ముందుగానే కాయలను కోసి మార్కెట్‌‌కు తెస్తున్నారు. -అనసూయ, హార్టికల్చర్ ఆఫీసర్, ఖమ్మం

వాతావరణ పరిస్థితుల వల్లే
వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం వల్లే ఈసారి మామిడి దిగుబడులు తగ్గినయ్. ఎకరానికి  8 నుంచి 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా.. రెండు, మూడు టన్నులకు మించి రాలేదు. పూత, కాత ఆలస్యం కావడంతో పక్వానికి రాక ముందే తెంపడం, కృత్రిమ పద్ధతుల్లో పండించడం వల్ల టేస్ట్ ఉంటలేవు.
- శ్యామరావు రాథోడ్, అసిస్టెంట్ డైరెక్టర్, హార్టికల్చర్ డిపార్ట్‌‌మెంట్, నిర్మల్ జిల్లా

మే 15 తర్వాత వస్తేనే..
పూత పట్టిన దగ్గర నుంచి కాయ కాసే వరకు ప్రతి వెరైటీకీ ఫిక్స్‌‌డ్‌‌ హీట్‌‌ అవర్స్‌‌ కావాల్సి ఉంటుంది. కనీసం వంద రోజులపాటు చెట్టుమీద ఉంటేనే కాయ పూర్తిగా వృద్ధి చెందుతుంది. కొంతమంది వ్యాపారులు కాయలు పక్వానికి రాకముందే కోసేస్తున్నారు. దీంతో కాయల్లోని కార్పోహైడ్రేట్స్‌‌ షుగర్స్‌‌ (చక్కెర)గా మారవు. దీంతో మామిడి తియ్యదనం తగ్గి చప్పగా, పుల్లగా మారుతాయి. గుజ్జు కలర్‌‌ మారితేనే తీపి ఎక్కువగా ఉంటుంది. రైతులు వడగండ్లు, గాలివానల వల్ల కాయలు రాలుతాయనే భయంతో తొందరగా కోసేసి మార్కెట్‌‌కు తరలిస్తారు. దశహరి, రసాలు తప్ప మిగిలిన రకాలన్నీ మే 15 తర్వాత వస్తేనే క్వాలిటీ బాగుంటాయి.
- డాక్టర్‌‌ రాజ్‌‌కుమార్‌‌, ఇన్‌‌చార్జ్‌‌, ఫ్రూట్‌‌ రీసెర్చ్‌‌ స్టేషన్‌‌, సంగారెడ్డి