బీఆర్కే భవన్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

బీఆర్కే భవన్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
  • నేటి నుంచి రెండు రోడ్ల మూసివేత
  •           వన్​ వే లుగా మార్పు
  •           వాహనదారులకు తిప్పలు

తాత్కాలిక సెక్రటేరియెట్​గా బీఆర్కే భవన్​ మారడంతో దాని చుట్టూ వాహనదారులకు ట్రాఫిక్​ కష్టాలు మొదలకానున్నాయి. భవన్​ ముందున్న రోడ్లను శుక్రవారం నుంచి ట్రాఫిక్​ అధికారులు మూసివేయనున్నారు. లిబర్టీ నుంచి జీహెచ్ ఎంసీ, బీఆర్కే భవన్ మీదుగా వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం మీదుగా మళ్లించనున్నారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా సెక్రటేరియెట్ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నారు. ఈ రోడ్లను వన్ వే లుగా మార్చనున్నారు. దీంతో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడనున్నారు. లిబర్టీ నుంచి సెక్రటేరియెట్ వైపు రోజూ 20 వేల వాహనాలు వస్తున్నట్లు అంచనా.  బీఆర్కే భవన్ లో పార్కింగ్ కొరత ఉండటంతో రోడ్లు మూసివేయాలని ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు.

ఫైళ్లు సర్దుతున్న సిబ్బంది

ఇప్పటికే సెక్రటేరియెట్​ నుంచి సీఎస్ సహా పలు శాఖల ముఖ్య కార్యదర్శులు బీఆర్కే భవన్ కు షిఫ్ట్ కావటంతో ఇతర శాఖల్లో ఫైళ్లు సర్దే ప్రక్రియ సాగుతోంది. బుధవారం ఏ బ్లాక్ లో ఉన్న నీటిపారుదల శాఖ ఫైళ్లను బీఆర్కే భవన్ కు తరలించడం మొదలైంది. ఫైళ్లను క్లాత్ లో, బస్తాల్లో ప్యాక్ చేస్తున్నారు. పరిశ్రమల శాఖ షిఫ్టింగ్​ త్వరలో ముగియనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా జీఏడీ శాఖ షిఫ్టింగ్ చేస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. మరికొంత సమయం పడుతుందని నోడల్ ఆఫీసర్లు చెప్తున్నారు. జీఏడీ సెక్షన్లు, ఫైళ్లు అధికంగా ఉండటంతో షిఫ్టింగ్ ఆలస్యమవుతోంది.

కుందన్ బాగ్ కే పరిమితమైన సీఎస్

బీఆర్కే భవన్ లో మరమ్మతులు పూర్తి కానందున బుధవారం సీఎస్ జోషి ఇంటికే పరిమితమయ్యారు. అక్కడి నుంచే అధికారిక కార్యక్రమాలు చేపట్టారు. పలు ఫైళ్ల క్లియరెన్స్ ను ఇంటి నుంచే చేసినట్లు తెలుస్తోంది. పనులు వేగంగా జరగాలని, మరమ్మతులను పర్యవేక్షించాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాను ఆయన ఆదేశించారు. బీఆర్కే భవన్​లోని తన చాంబర్​లో అధర్ సిన్హా సెక్రటేరియెట్​ సీఎస్ వో  త్రినాథ్​తో సమావేశమై సమీక్షించారు. సెక్రటేరియెట్ నుంచి శాఖలు, పెద్దాఫీసర్లు బీఆర్కే భవన్ కు, ఇతర చోట్లకు షిఫ్ట్​ అవుతుండటంతో సెక్రటేరియెట్ కు వచ్చే విజిటర్స్ సంఖ్య తగ్గింది. సాధారణంగా సెక్రటేరియెట్​కు రోజు సుమారు 500 మంది విజిటర్స్​ వస్తుంటారు. షిఫ్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ  సంఖ్య 150కి పడిపోయింది. మరో నాలుగు రోజుల తర్వాత అయితే విజిటర్స్ రాకపోవచ్చని విజిటర్స్ సెక్షన్ ఆఫీసర్ తెలిపారు.

డేటా సెంటర్​కు  నో బడ్జెట్​?

బీఆర్కే భవన్ లో రెండో ఫ్లోర్ లో డేటా సెంటర్, సర్వర్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.18 కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనా వేసి ఆర్థిక శాఖకు ఐటీ శాఖ ప్రతిపాదనలను  పంపింది. వాటిని సీఎంవో దృష్టికి ఆర్థిక శాఖ ఆఫీసర్లు తీసుకెళ్లారు. షిఫ్టింగ్, రిపేర్లకే భారీగా ఖర్చు అవుతున్నందున ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ఇచ్చే పరిస్థితి లేదని పలువురు ఆఫీసర్లు అంటున్నారు. దీంతో బీఆర్కే భవన్ లో ఉన్న నేషనల్ ఇన్ఫర్మాటిక్​ సెంటర్ (ఎన్​ఐసీ) సహకారంతో డేటా సెంటర్​, సర్వర్​ రూమ్​  ఏర్పాటు చేయనున్నారు. కేబుల్ తో ఇతర సామగ్రిని సమకూరుస్తామని ఎన్ ఐ సీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం డేటా సెంటర్ నిర్వహకులు బీఆర్కే భవన్ ను పరిశీలించారు. భవన్​లో డేటా సెంటర్ ఏర్పాటుకు 45 రోజుల సమయం అడిగామని , కానీ ప్రభుత్వం అంత సమయం ఇవ్వలేమని చెప్పిందని ఓ అధికారి తెలిపారు. త్వరలో షిఫ్టింగ్​ను ప్రారంభిస్తామన్నారు.