హైదరాబాద్ చింతల్‌లో విషాదం.. గోల్డ్ షాప్ బయట ఆడుకుంటూ సైనైడ్ తిని రెండున్నరేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్ చింతల్‌లో విషాదం.. గోల్డ్ షాప్ బయట ఆడుకుంటూ సైనైడ్ తిని రెండున్నరేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్: జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. దురదృష్టవశాత్తూ సైనైడ్ తిని రెండున్నరేళ్ల చిన్నారి చనిపోయింది. సస్తా బజార్ ఎదురుగా ఉన్న విష్ణు జ్యువెలరీ షాప్ దగ్గరకు రెండేళ్ల చిన్నారి మిషా తల్లితో పాటు వెళ్లింది.

షాప్లో తల్లి మాట్లాడుతూ ఉండగా.. పాప బయట ఆడుకుంటూ ఉంది. ఆడుకుంటూ బయటకు వచ్చిన మిషా ప్రమాదవశాత్తు సైనైడ్ తినింది. అక్కడ సైనైడ్ ఎందుకు ఉందంటే.. షాప్ బయట గోల్డ్ వర్కర్ నిర్లక్ష్యంగా వదిలేసిన సైనైడ్ పదార్థమే చిన్నారి ప్రాణం తీసిందని తెలిసింది. షాప్ యజమాని, సిబ్బంది తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చింతల్‌లోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ పాప చనిపోయింది. పాప మృతి చెందిందని తెలిసి భయంతో ఆసుపత్రిలోనే చిన్నారిని వదిలేసి షాప్ యజమాని పరారయ్యాడు.

విష్ణు జ్యువెలరీ ఎదుట బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. జీడిమెట్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న షాప్ యజమాని, గోల్డ్ వర్కర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.