బిల్లులు రాక.. బీఆర్​ఎస్​సర్పంచ్ ఆత్మహత్య

బిల్లులు రాక.. బీఆర్​ఎస్​సర్పంచ్ ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులకు తోడు ఆరోగ్య సమస్యలతో మనస్తాపం 
  • పది రోజుల కిందటే కలెక్టర్, డీపీఓకు రాజీనామా లెటర్ 
  • సంగారెడ్డి జిల్లా పెద్ద ముబారక్ పూర్ లో విషాదం


నారాయణఖేడ్, వెలుగు:ఊర్లో చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై బీఆర్ఎస్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్ పూర్​లో జరిగింది. గ్రామ సర్పంచ్ ఆసం దిగంబర్ (48) తన సొంత డబ్బులతో ఊర్లో డ్రైనేజీ, రోడ్డు పనులు చేయించారు. అయితే ఆ పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. దీంతో దిగంబర్​కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రావడం లేదని, ఊర్లో పనులేమీ చేయలేకపోతున్నానని మనస్తాపం చెందారు.

సర్పంచ్ ఆత్మహత్య

ఈ క్రమంలో ఈ నెల 1న తన పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోకు లెటర్ అందజేశాడు. అయితే రాజీనామాను అధికారులు ఆమోదించలేదు. దీంతో మరింత మనస్తాపం చెందిన దిగంబర్.. బుధవారం రాత్రి ఊర్లోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కాగా, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అని చెబుతున్న ప్రభుత్వం.. సర్పంచులు చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేకపోతోందని మండిపడ్డారు. బిల్లులు రాక చివరకు ఆర్థిక ఇబ్బందులతో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.