HDFC బ్యాంక్ మేనేజర్.. నడి రోడ్డుపై గుంతలో పడి మృతి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఫ్యామిలీ..!

HDFC బ్యాంక్ మేనేజర్.. నడి రోడ్డుపై గుంతలో పడి మృతి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఫ్యామిలీ..!

దేశ రాజధాని ఢిల్లీ మహానగరం. అర్థరాత్రి జరగరాని ఘోరం జరిగింది. ఊహించని ఘటన. ఇళ్ల నుంచి రోడ్డు ఎక్కే ప్రతి ఒక్కరికి షాకింగ్ ఇన్సిడెంట్ ఇది. కారణం ఏంటో తెలుసా.. ఢిల్లీ నడి రోడ్డుపై తీసిన గుంతలో పడి ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ చనిపోయాడు.. రాత్రంతా ఎవరూ గమనించలేదు.. ఎవరూ చూడలేదు.. వెంటనే చూసి ఉంటే బతికే వాడేమో.. ఈ ఘటన ఇప్పుడు ఢిల్లీలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

అతని పేరు కమల్. ఢిల్లీలోని రోహిణి ఏరియాలోని HDFC బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. 2026, ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం ఎప్పటిలాగే ఇంట్లో బ్యాంకుకు బయలుదేరాడు. తన సొంత బైక్ వెళ్లాడు. రాత్రి బ్యాంక్ పని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. జనక్ పురి ఏరియాలో.. నడి రోడ్డుపై వాటర్ బోర్డ్ తీసిన గుంతలతో.. తన బైక్ తో సహా పడి చనిపోయాడు. రాత్రి ఘటన జరిగితే.. 6వ తేదీ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అతన్ని గుర్తించారు. గుంతలో బైక్.. ఆ పక్కనే కమల్ డెడ్ బాడీ పడి ఉంది. 

ఢిల్లీలో ఈ ఘటన సంచలనంగా మారింది. రాత్రి 9 గంటల వరకు కమల్ ఇంటికి రాలేదు. కంగారు పడిన కమల్ కుటుంబ సభ్యులు పదే పదే ఫోన్ చేసినా.. ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తుంది. దీంతో మరింత భయపడి.. రాత్రంతా రోడ్లపై వెతికారు. ఇదే సమయంలో జనక్ పురి, సాగర్ పురి, వికాస్ పురి, రోహిణి పోలీస్ స్టేషన్లకు వెళ్లారు కుటుంబ సభ్యులు. అయినా స్పందన లేదు. రాత్రంతా అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం అని.. అయినా ప్రయోజనం లేదని.. ఎవరూ పట్టించుకోలేదని కమల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ఉదయం ఫోన్ లొకేషన్ ఆధారంగా స్పాట్ కు చేరుకున్నారు పోలీసులు. అప్పటికే గుంతలో బైక్ తో సహా శవంగా కనిపించాడు కమల్. దీనిపై మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమల్ కుటుంబ సభ్యులు. కంప్లయింట్ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే.. బతికి ఉండేవాడు ఏమో.. రాత్రంతా గాయాలతో.. బయటకు రాలేని దుస్థితిలో ఉండి ఉండొచ్చు కదా అంటున్నారు కమల్ పేరంట్స్. 

ఈ ఘటనపై సోషల్ మీడియా వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో.. రోడ్లపై గుంతల్లో పడి బైకర్లు చనిపోతున్నారా అంటూ తిట్టిపోస్తున్నారు. గుంత తీసినోళ్లు హెచ్చరిక బోర్డులు ఎందుకు పెట్టలేదు.. గుంత చుట్టూ క్రాసింగ్ లైన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు.. గుంతపై కనీసం సెక్యూరిటీ కింద ఏదైనా పెట్టొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. 

ఎంతో భవిష్యత్ ఉన్న కమల్.. బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తూ ఉన్నాడని.. అలాంటి యువకుడిని ఢిల్లీ వాటర్ బోర్డ్ చంపేసింది అంటూ పోస్టు పెడుతున్నారు నెటిజన్లు. ఈ విషయంపై ఢిల్లీ ప్రతిపక్ష పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంది. ఢిల్లీ ఇప్పుడు ఎలా ఉందో జనం చూస్తున్నారు.. అనుభవిస్తున్నారు అంటూ అధికార బీజేపీపై విరుచుకు పడుతోంది.