ఓలా, ఉబర్ మూసేయాలి.. ట్రాన్స్​పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్

ఓలా, ఉబర్ మూసేయాలి.. ట్రాన్స్​పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్
  •  ట్రాన్స్​పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్
  •  ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి


నారాయణగూడ, వెలుగు: రాష్ట్రంలో ఓలా, ఉబర్, రాపిడో సేవలపై నిషేధం విధించాలని ఏఐటీయూసీ తెలంగాణ మోటార్ ట్రాన్స్​పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బైరగోని రాజు డిమాండ్ చేశారు. వీటితో లక్షలాది మంది స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని, ఫలితంగా వారి ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని హిమాయత్ నగర్​లో నిర్వహించిన సమావేశంలో బైరగోని రాజు మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓలా, ఉబర్ సంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని తెలిపారు. ఎల్లో నంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్​ను ఎయిర్ పోర్ట్ లోకి రానీయకుండా బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నాయని వాపోయారు. రోడ్ ట్యాక్స్ లేని వైట్ ప్లేట్స్ వెహికల్స్ ను ట్యాక్సీలుగా నడపడానికి ప్రభుత్వం, జీఎంఆర్ సంస్థ ఎందుకు అనుమతిస్తున్నాయని ప్రశ్నించారు. కమర్షియల్ రోడ్ ట్యాక్స్ కట్టిన ట్యాక్సీలను అడ్డుకోవడం వల్ల క్యాబ్ డ్రైవర్లు నష్టపోతున్నారని తెలిపారు. ట్యాక్స్ చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న ఓలా, ఉబర్ వైట్ నంబర్ ప్లేట్ల వెహికల్స్​ను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల నుంచి ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు 35% కమీషన్ వసూలు చేస్తున్నాయని చెప్పారు. ఓలా, ఉబర్ సంస్థలతో మంత్రి కేటీఆర్ చర్చించి కమీషన్ దోపిడీ నుంచి తమను కాపాడాలని కోరారు.