మొక్కలే ఆయన ఆస్తి

మొక్కలే ఆయన ఆస్తి

పుల్లబోయిన పోచయ్యది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ నికౌటాల మండలం బోధంపల్లి గ్రామం. ప్రతిరోజు ఊరికి దగ్గర్లో ఉన్న ‘కనికి అటవీ బీట్‌’లోకి పశువులను మేతకు తీసుకెళ్లేవాడు. ముప్పైఏళ్లుగా ఇదే పని. అయితే, 2000 సంవత్సరంలో స్థానికులు అటవీ భూముల్లో పోడు వ్యవసాయం కోసం చెట్లు నరకడం గమనించాడు. వ్యవసాయం కోసం పచ్చని చెట్లను నరకడం నచ్చలేదు. దీంతో మొక్కలు నాటాలనుకున్నాడు. ఇలా సుమారు 30 ఎకరాల అటవీ భూమిలో మొక్కలు నాటాడు. ఒక రకంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘హరితహారం’ కార్యక్రమాన్ని పోచయ్య.. 2001లోనే మొదలుపెట్టాడు.

పెద్దగా ఆదాయం లేకున్నా..
అడవులను నరుకుతున్న స్థానికులను పోచయ్య అడ్డుకున్నాడు. దీంతో గ్రామస్తులు, రైతులతో గొడవలు కూడా జరిగాయి. అయినా పోచయ్య మొక్కల పెంపకానికి కృషి చేశాడు. పశువులు మేపితే తప్ప పోచయ్యకు రూపాయి ఆదాయం రాదు. అలాంటి పరిస్థితుల్లోనూ ఒక పక్క కుటుంబాన్ని పోషించుకుంటూనే.. బెల్లంపల్లి, మంచిర్యాలలో తిరిగి కానుగ, నీలగిరి విత్తనాలు తెచ్చి ప్లాంటేషన్లు చేశాడు. దీంతో ఈ విషయం నక్సలైట్లకు చేరింది. ఒకసారి ‘నీకేం పనిరా’ అంటూ నక్సలైట్లు పోచయ్యను కొట్టారు. అయినప్పటికీ మొక్కల పెంపకం మాత్రం ఆపలేదు పోచయ్య.

తాత్కాలిక అటవీవాచర్ గా..
వన సంరక్షణ, పోడు ఆక్రమణలు జరగకుండా పోచయ్య కృషి చేశాడు. అప్పట్లో అటవీ అధికారులు సైతం చేయలేని పనిని ఈ పశువుల కాపరి చేశాడు. దీంతో 2003లో అటవీ శాఖ పోచయ్య పనిని గుర్తించింది. అప్పటి డీఎఫ్ఓలు అశోక్, నాగనాథ్‌.. పోచయ్యను తాత్కాలిక అటవీ వాచర్ గా నియమించారు. దీంతో పోచయ్య తన పనిలో మరింత జోరు పెంచాడు. ‘అటవీ భూమి జోలికి ఎవరూ రావొద్ద’ని హెచ్చరికలు కూడా చేశాడు.

వంద ఎకరాల్లో ప్లాంటేషన్
వనజీవి రామయ్యకు ఏ మాత్రం తీసిపోకుండా అడవుల సంరక్షణ, నర్సరీలు పెంపకం చేపట్టాడు పోచయ్య. మొదట సుమారు 20 ఎకరాల్లో ప్రారంభమైన నర్సరీల పెంపకం.. తర్వాత వంద ఎకరాలకు పెరిగింది. ఆర్థిక ఇబ్బందులున్నా వన సంరక్షణ కోసం పోచయ్య చేసిన కృషిని అభినందించని వాళ్లుండరు. అటవీ వాచర్ గా పనిచేయగా వచ్చే నాలుగు వేల రూపాయలతో కుటుంబాన్ని పోషించేవాడు. అటవీ శాఖ నర్సరీల్లో పెంచే మొక్కలను తీసుకొచ్చి.. అటవీ భూముల్లో నాటేవాడు. 2001లో నాటిన కానుగ, నీలగిరి మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారడమే ఆయన పనికి సాక్ష్యం.

ఇంత చేసినా ఏది సాయం…
అడవుల నరికివేత, పోడు భూముల ఆక్రమణలు అడ్డుకోవడంతో పాటు సొంత ఖర్చులతో మొక్కలు నాటిన ఈ వన ప్రేమికుడికి తగిన ఫలితం మాత్రం దక్కలేదు. ముగ్గురు అన్నదమ్ముల కుటుంబంలో తండ్రి పేరుతో మూడు ఎకరాల భూమి తప్ప పోచయ్యకు మరో ఆధారం లేదు. గ్రామస్తులు, తోటివాళ్లు పదుల ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించి పోడు వ్యవసాయం చేసుకుంటుంటే.. పోచయ్య ఆ దారిని ఎంచుకోలేదు. కానీ, పోచయ్యకు అటు అటవీ శాఖ నుంచి ఎలాంటి సాయం అందలేదు. పదహారేళ్లుగా తాత్కాలిక పద్ధతిలో వాచర్ గా పని చేస్తున్నా జాబ్‌ రెగ్యులర్‌ చేయలేదు. కనీసం జీతం కూడా సరైన స్థాయిలో ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం లేదు.

సచ్చే దాకా చెట్లు పెంచుతా..
చెట్లు పెంచుడేనా పని. సచ్చే దాకా ఇదే పని చేస్తా. జంగల్ లేకుంటే ఎడ్లు, గొడ్లు, మేకల మేతకు ఆపతి అయితది. ఇప్పుడు నేను పెంచిన ప్లాంటేషన్‌ వంద ఎకరాల్లో ఉంది. రోజు ప్లాంటేషన్‌కు రాకుంటే మనసు ఒప్పది. ఫారెస్ట్ సార్లు, సీఎంకి దరఖాస్తు ఇచ్చిన. వాళ్లే నాగురించి పట్టించుకోవాలె. కనీసం జాబ్ ని రెగ్యులర్ చేస్తే మంచిగుంటది. గవర్నమెంట్, అటవీ శాఖ ఆఫీసర్లు ఏమిచ్చినా.. ఇవ్వకున్నా.. జంగల్ ని కాపాడుడే నాపని. ఈడ అధికారులైతే మంచిగనే ఉన్నరు. ఇక సర్కార్‌ దయ ఎట్లుంటదో చూడాలె.
– పుల్లబోయిన పోచయ్య