సామాజిక న్యాయం కోసం పోరాటం ఆగదు : కవిత

సామాజిక న్యాయం కోసం పోరాటం ఆగదు : కవిత

కామారెడ్డిలో గతంలో చేపట్టిన రైల్ రోకో కేసులో నాంపల్లిలోని రైల్వే కోర్టుకు టీఆర్ఎస్ చీఫ్  కవిత హాజరయ్యారు. కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆమెతో పాటు మరో 12 మంది నిందితులు న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.

విచారణ అనంతరం మీడియాతో  మాట్లాడిన కవిత.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు. కామారెడ్డిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పుతోంది. ఆ సామాజిక న్యాయం కోసమే మేము రైల్ రోకో చేపట్టాం. రాష్ట్రం పంపిన బీసీ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి.. లేకపోతే ప్రజల ఆగ్రహం తప్పదని ఆమె హెచ్చరించారు.బిసిల రిజర్వేషన్ల సాధన కోసం నిరవధిక రైలు రోకో కార్యక్రమాలు కొనసాగుతాయి అని కవిత చెప్పారు. 

ఇదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న పోక్సో కేసు ఆరోపణలపైనా కవిత స్పందించారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తి.. ప్రధాని, ముఖ్యమంత్రితో కలిసి వేదికలు పంచుకోవడం చట్టాలను అగౌరవపరచడమేనని ఆమె విమర్శించారు. ప్రభుత్వం వెంటనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

అయితే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేయడం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చి పాలమూరు ప్రాజెక్టుకు నిధులు తేవాలని సూచించారు.