
- టీఆర్ఎస్ సభ 15కు బదులుగా ఈ నెల 29న
- వరంగల్ లీడర్ల రిక్వెస్ట్ మేరకే ఈ నిర్ణయమని ప్రకటన
- ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పెట్టుకుందాం
- మంత్రులు, వరంగల్ ఎమ్మెల్యేలతో కేసీఆర్
- హుజూరాబాద్ రిజల్ట్ కు భయపడే: ప్రతిపక్షాలు
హైదరాబాద్, వెలుగు:హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనున్న వేళ టీఆర్ఎస్ వరంగల్ విజయగర్జన బహిరంగ సభను వాయిదా వేసుకుంది. ఈ నెల 15న ఉంటుందని ప్రకటించిన సభను 29కి వాయిదా వేస్తూ టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన దీక్ష దివస్ నాడే, అంటే నవంబర్ 29న సభ పెట్టుకుందామని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కోరిన్రు. ఆ మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నరు. సభ కోసం ఏర్పాటు చేసుకున్న బస్సులు తదితర రవాణా వ్యవస్థలను 29కి వాయిదా వేసుకోవాలని, తేదీ మార్పును కార్యకర్తలకు తెలియజేయాలని నేతలను సీఎం ఆదేశించారు” అని వెల్లడించింది.
ఉప ఎన్నిక రిజల్ట్‌తో..
టీఆర్‌ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో 10 లక్షల మందితో విజయగర్జన సభ జరపాలని ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. సభకు జనం తరలింపుపై 103 నియోజకవర్గాల నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఆరు రోజులు సమావేశాలు జరిపారు. 22 వేల బస్సుల్లో నేతలను, జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక రిజల్ట్ కేసీఆర్ ను కలవరపాటుకు గురిచేస్తున్నదని, అందుకే సభను వాయిదా వేశారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. వరంగల్ శివార్లని మడికొండ, ఉచికిచర్ల, రాంపూర్, కడిపికొండ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో సభ జరపాలని టీఆర్ఎస్ భావించింది. ఉమ్మడి వరంగల్ నేతలు ఇప్పటికే ఆ స్థలాలను పరిశీలించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం కూడా వాటిని పరిశీలించారు. 10 లక్షల మందితో సభ అంటే 400 ఎకరాల ఖాళీ స్థలం కావాలని అంచనా. ఆయా ప్రాంతాల్లో 300 ఎకరాలే అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కేసీఆర్‌ను కలిసి చెప్పారు. వారితో సీఎం 45 నిమిషాలు సమాలోచనలు జరిపారు. ‘‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అభ్యర్థుల ఎంపిక తదితర కసరత్తు ఉంది. ఈ పరిస్థితుల్లో విజయగర్జన సభ వద్దు. ఎమ్మెల్సీ ఎన్నికలైనంక పెట్టుకుందాం. ఈలోపు మరిన్ని ఖాళీ స్థలాలు పరిశీలించండి” అని వారికి సీఎం సూచించినట్టు తెలిసింది.