బంజారాహిల్స్లో లక్కీ బిర్యానీ పేరుతో మోసం.. రోజుల తరబడి ఫ్రిజ్లో నిల్వ.. వేడిచేసి జొమాటో ద్వార అమ్మకాలు

బంజారాహిల్స్లో లక్కీ బిర్యానీ పేరుతో మోసం.. రోజుల తరబడి ఫ్రిజ్లో నిల్వ.. వేడిచేసి జొమాటో ద్వార అమ్మకాలు

ఆకలేసినా.. రోజూ తినే ఫుడ్ బోర్ కొట్టినా.. ఫ్రెండ్స్ కలిసినా.. టక్కున గుర్తొచ్చేది జొమాటో. ఇలా ఆర్డర్ చేస్తే వేడివేడిగా అలా వస్తుండటంతో బుక్ చేయడం కామన్ అయిపోయింది. కానీ.. ఆ వేడి వేడి బిర్యానీ వెనుక.. ఎంత మోసం ఉందో.. ఎంత అనారోగ్యం ఉందో తెలిస్తే యాక్ అంటారు. హైదరాబాద్ లో బయటపడిన బిర్యానీ మోసం గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ అపార్ట్మెంట్ లక్కీ బిర్యానీ, షవర్మా పేరుతో జరుగుతున్న భారీ మోసం బయటపడింది. లక్కీ బిర్యానీ అనే బ్రాండ్ చూసి జోమాటోలో ఆర్డర్ చేస్తున్న వారికి అనారోగ్యం గిఫ్ట్ గా ఇచ్చేలా వీళ్లు చేస్తున్న దందా ఆందోళనకు గురిచేస్తోంది. వేడి వేడి బిర్యానీ పేరుతో రోజుల తరబడి నిల్వ ఉంచిన బిర్యానీలు అమ్మటం చూస్తుంటే అసలు బిర్యానీ ఆర్డర్ చేయాలా.. తినటమే మానేయాలా అనే సందేహం కలగక మానదు.

బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్ మెంట్ లో వందలాది బిర్యానీలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారు. ముందుగానే ప్యాక్ చేసి వందల ప్యాకెట్లు ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారు. ఆర్డర్ వచ్చిన వెంటనే ఓవెన్‌లో వేడిచేసి అమ్ముతున్నారు. ఎక్కువ శాతం జొమోటో ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు దుండగులు. ఓవెన్ లో వేడి చేసి.. కస్టమర్లకు తాజా బిర్యానీలు అని నమ్మించి మోసం చేస్తున్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  

ఆర్డర్​ చేస్తే కుళ్లిన బిర్యానీ:

జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన బిర్యానీ కుళ్లిపోయి, దుర్వాసన రావడంతో సదరు రెస్టారెంట్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్​కు చెందిన డి. కొండారెడ్డి ఏప్రిల్ 5న ‘న్యూ లక్కీ బిర్యానీ, షవర్మా బిర్యానీ’ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆహారం తినడానికి వీల్లేకుండా ఉండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై వెంటనే స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు సదరు అవుట్​లెట్​లో తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి నేమ్ బోర్డు లేకుండా రెస్టారెంట్​నిర్వహించడమే కాకుండా ఆ ప్రాంతంలో సుమారు 80 పాడైపోయిన బిర్యానీ ప్యాకెట్లను గుర్తించారు. దీంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న సదరు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.