పచ్చగింజ సాకుతో.. అగ్గువకు కొంటున్రు...మిర్యాల గూడ ప్రాంతంలో వరి కోతలు షురూ

పచ్చగింజ సాకుతో.. అగ్గువకు కొంటున్రు...మిర్యాల గూడ ప్రాంతంలో వరి కోతలు షురూ
  • అకాల వర్షం భయంతో మిల్లులకు వడ్లు తరలిస్తున్న రైతులు
  • ఇదే అదనుగా దగా చేస్తున్న మిల్లర్లు

నల్గొండ, వెలుగు: ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభం అవుతుండగా, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంట నష్టపోతామనే భయంతో రైతులు వడ్లను మిల్లులకు తరలిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు సాకులు చెబుతూ ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తూ రైతులను దగా చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎక్కువ రైస్  మిల్లులు ఉన్నాయి. 

సీజన్  ప్రారంభంలో మంచి రేటు ఇచ్చిన మిల్లర్లు వడ్లు రావడం క్రమంగా పెరగడంతో సిండికేట్​గా ఏర్పడి రైతులను దోచేస్తున్నారు. పచ్చ గింజ(ఆకుపచ్చ రంగులో ఉందనే కారణంతో) పేరుతో కొర్రీలు పెడుతూ ధరను తగ్గించి ఇస్తున్నారు. నిన్నమొన్నటి వరకు సన్న వడ్లకు రూ.2,700 వరకు ధర పలకగా, ప్రస్తుతం మిల్లర్లు సిండికేట్‌‌‌‌గా మారి రూ.250 ధర తగ్గించారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

తక్కువ ధరకు వడ్ల కొనుగోలు..

యాసంగిలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్‌‌‌‌  ఆయకట్టు కింద 3.20 లక్షల ఎకరాల్లో రైతులు సన్నాలను సాగు చేశారు. 15 రోజులుగా ఆయకట్టు పరిధిలో సన్న వడ్ల కోతలు ప్రారంభమయ్యాయి. ఈ వడ్లన్నీ మిర్యాలగూడలోని రైస్  మిల్లులకు ఎక్కువగా వస్తుండగా, 15 రోజుల నుంచి రైతుల నుంచి వడ్లను రూ.2,650 నుంచి రూ.2,750 వరకు కొనుగోలు చేశారు. రెండు రోజులుగా వడ్లు రావడం పెరగడంతో మిల్లర్లు సిండికేట్‌‌‌‌గా మారి రూ. 2,180 నుంచి రూ.2,300 వరకు చెల్లిస్తున్నారు. 

పచ్చగింజ పేరుతో దగా..

కొంత మంది మిల్లర్లు వడ్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయని చెబుతూ రూ.2,350 చెల్లిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇష్టం ఉన్నచోట అమ్ముకోండంటూ మిల్లర్లు బెదిరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌‌‌‌లో సన్నాలకు డిమాండ్​ బాగానే ఉంది. ఇందుకు అనుగుణంగా ధర అందించాల్సిఉంది. అయితే వడ్ల ట్రాక్టర్లు ఎక్కువగా వస్తుండడంతో మిల్లర్లు క్వింటాల్​కు రూ.250కు పైగా ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 

మిల్లర్లకు పోలీసుల వత్తాసు..

మిల్లర్ల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మిల్లర్లను ప్రశ్నించే రైతుల పట్ల పోలీసులు దురుసుగు ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. సన్నాలను ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి మిల్లర్లు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మిల్లర్లంతా సిండికేట్‌‌‌‌ కావడంతో ఒకేసారి క్వింటాల్​కు రూ.250 ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మిల్లర్లతో విభేదించి ఆందోళనకు దిగుతుండగా, తమను పోలీసులు బెదిరిస్తున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని వడ్లకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.