- జీఎస్టీ తగ్గింపుతో మేలు
- వెల్లడించిన ఫాడా రిపోర్ట్
న్యూఢిల్లీ: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటో మొబైల్ రంగం అద్భుత పనితీరు కనబరిచింది. వెహికల్స్ రిటైల్ విక్రయాలు 13.3 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 2,96,71,064 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది 2,61,87,255 యూనిట్లు అమ్ముడయ్యాయి. జీఎస్టీ 2.0 అమలుతో మార్కెట్ పుంజుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం ఈ వివరాలు వెల్లడించింది. దాదాపు 3 కోట్ల అమ్మకాలు నమోదు కావడం పరిశ్రమ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొంది.
- వివిధ విభాగాల పనితీరు
ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) అమ్మకాలు 13 శాతం వృద్ధి చెందాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 47,05,056 పీవీలు అమ్ముడవగా.. అంతకుముందు ఏడాది 41,63,927 యూనిట్లు సేల్ అయ్యాయి. టూవీలర్స్ అమ్మకాలు 13.4 శాతం పెరిగి 2,14,20,386 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్స్ విక్రయాలు 11.68 శాతం వృద్ధితో 13,63,412 యూనిట్లుగా నమోదయ్యాయి.
కమర్షియల్ వెహికల్స్ (సీవీ) 11.74 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 10,60,906 యూనిట్లుగా ఉన్నాయి. ఆరు వాహన విభాగాల్లో ఐదు రికార్డు స్థాయి అమ్మకాలు సాధించడం విశేషం. జీఎస్టీ తగ్గింపు వల్ల పన్ను భారం తగ్గి సామాన్యులకు వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయని, అమ్మకాలు పెరిగాయని ఫాడా తెలిపింది.
- ముందున్నయ్ సవాళ్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఆటో రంగానికి ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల ఇంధన ధరలు పెరగడం, వెహికల్స్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని ఫాడా పేర్కొంది. సుమారు 53.2 శాతం డీలర్లు వెహికల్స్ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం వల్ల విడిభాగాల రాక ఆలస్యమవుతోంది. ఇంధన ధరల భయం వినియోగదారులను సీఎన్జీ, ఈవీ వెహికల్స్ వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం వెహికల్స్లోన్ల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు పరిణామాలను నిశితంగా గమనించాల్సి ఉందని ఫాడా తెలిపింది.
