న్యూక్లియర్ బాంబు తయారు చేయబోమని ఇరాన్ మాటిచ్చింది: ట్రంప్

న్యూక్లియర్ బాంబు తయారు చేయబోమని  ఇరాన్  మాటిచ్చింది: ట్రంప్
  • న్యూక్లియర్​ బాంబు తయారు చేయబోమని ఆ దేశం మాటిచ్చింది: ట్రంప్
  • పీస్ డీల్‌‌‌‌లో ఈ మేరకు ఆమోదం తెలిపిందని వెల్లడి
  •  ఇరాన్‌‌‌‌కు 300 మిలియన్ డాలర్ల నిధులు ఇస్తామన్నది ఫేక్ న్యూస్ 
  • లెబనాన్ విషయంలో నెతన్యాహు బాధ్యతగా ఉండాలని హెచ్చరిక
  • ఫ్రాన్స్‌‌‌‌లో జీ7 సమిట్ వేదికగా అమెరికా ప్రెసిడెంట్ కామెంట్స్  


పారిస్: ఎన్నటికీ అణు ఆయుధాలను సమకూర్చుకోకూడదనే నిబంధనకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ ఇరాన్ తన బాధ్యతలను నెరవేరిస్తే, శాంతి ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి పునర్నిర్మాణం కోసం 300 మిలియన్ డాలర్ల నిధులను అమెరికా ఇస్తుందన్న ప్రచారాన్ని కూడా ఖండించారు. ‘‘ఇరాన్‌‌‌‌కు అమెరికా 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందంటూ వస్తున్న వార్త అబద్ధం. ‘డెమోక్రాట్లు’ సృష్టించిన ఫేక్ న్యూస్ ఇది” అని ట్రంప్ మంగళవారం తన ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.

అయితే, ఈ నెల 19న అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత, 60 రోజుల చర్చల వ్యవధిలో ఇరాన్ అణు సమస్యపై ఏదైనా తుది నిర్ణయం జరుగుతుందని ఇరాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అలాగే, ఫ్రాన్స్‌‌‌‌లో జరుగుతున్న జీ7 సమిట్ సందర్భంగా ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ అణు నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి తొందరేమీ లేదన్నారు. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ఇరాన్ అణు ఆయుధాన్ని పొందకుండా అడ్డుకోవడమేనని చెప్పారు. ప్రస్తుత ఒప్పందం ‘అణు ఆయుధానికి వ్యతిరేకంగా నిర్మించిన ఒక గోడ’ లాంటిదని ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్ గనుక అణు ఆయుధాలను తయారు చేసినా లేదా కొనుగోలు చేసినా ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని, ఆ దేశం నరకంగా మారుతుందని హెచ్చరించారు. అయితే, ఇరాన్‌‌‌‌తో ఒప్పందం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇరాన్ ఒప్పంద పత్రాన్ని అధికారికంగా విడుదల చేస్తానని ట్రంప్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని పరిశీలన కోసం కాంగ్రెస్‌‌‌‌ (యూఎస్ పార్లమెంట్)కు పంపుతానని తెలిపారు.

నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు

ఇజ్రాయెల్ భద్రత పూర్తిగా అమెరికా మద్దతుపైనే ఆధారపడి ఉందని, అమెరికా అండ లేకపోతే ఆ దేశం తుడిచిపెట్టుకుపోయేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. బీబీ(ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు)తో తనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని, తాను జోక్యం చేసుకోకుంటే ఇజ్రాయెల్ ఎప్పుడో నాశనమై ఉండేదన్నారు. ఇజ్రాయెల్ కోసం ఏ అమెరికా అధ్యక్షుడూ చేయని పనులను తాను చేశానని చెప్పారు. అయితే, లెబనాన్ వివాదాన్ని ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హెజ్బొల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య సుదీర్ఘకాలం సాగుతుండటాన్ని విమర్శిస్తూ.. లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.

ఈ సుదీర్ఘ శత్రుత్వం ఇరాన్‌‌‌‌తో జరుగుతున్న చర్చలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందన్నారు. ఇజ్రాయెల్ గనుక ప్రజలను చంపకుండా హెజ్బొల్లాను అంతం చేయలేకపోతే, సిరియానే ఆ హెజ్బొల్లా సంగతి చూసుకోవాలని వ్యాఖ్యానించారు. కాగా, మరిన్ని అరబ్, పశ్చిమాసియా దేశాలు అబ్రహం ఒప్పందాల్లో చేరి, ఇజ్రాయెల్‌‌‌‌తో దౌత్యపరమైన సంబంధాలను ఏర్పరచుకుంటాయని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ చుట్టూ ఉన్న ఉద్రిక్తతలే ఈ ప్రాంతంలో సంబంధాల పునరుద్ధరణకు అడ్డంకిగా మారాయని, ఇప్పుడు ఆ దేశాలన్నీ ముందుకు వస్తాయని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.