అవసరమైతే ఆలోచిస్తా: అఫ్గాన్–పాక్ యుద్ధంలో జోక్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అవసరమైతే ఆలోచిస్తా: అఫ్గాన్–పాక్ యుద్ధంలో జోక్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు చివరకు బహిరంగ యుద్ధానికి దారితీశాయి. అఫ్గాన్ పాలకపక్షమైన తాలిబన్లపై పాకిస్తాన్ బహిరంగ యుద్ధం ప్రకటించడమే కాకుండా, శుక్రవారం (ఫిబ్రవరి 27) ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కాబూల్, కాందహార్, పక్తియా ప్రాంతాలు లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా తాలిబన్ ప్రభుత్వం పాక్‎‎లోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు నిర్వహించింది. 

అంతేకాకుండా తమ 'ఆత్మాహుతి’ దళాలను  రక్షణ రంగంలోకి దించినట్లు తాలిబన్లు ప్రకటించడంతో ఇరుదేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ యుద్ధంలో జోక్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఆప్ఘాన్–పాక్ వివాదంలో జోక్యం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ ఇష్యూలో అమెరికా వేలు పెడుతుందని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లైంది.

పాకిస్తాన్ నాయకత్వం సూపర్: ట్రంప్ 

ఆప్ఘాన్–పాక్ సరిహద్దు వివాదం వేళ పాకిస్తాన్ నాయకత్వంపై ట్రంప్ బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. పాక్ పీఎం షెహబాజ్ షరీష్, ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తాను గౌరవించే బలమైన నాయకులని కొనియాడారు. తాను పాకిస్తాన్‌తో చాలా బాగా కలిసిపోతానన్నారు. ఆ దేశం అద్భుతంగా పని చేస్తోందని ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు బహిరంగంగా దాడులు చేసుకునే వరకు వెళ్లిన సమయంలో పాక్ నాయకత్వాన్ని ట్రంప్ పొగడటం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఇష్యూలో అమెరికా విదేశాంగ శాఖ కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. తాలిబన్లపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సాధారణ పౌరుల మరణాలకు సంతాపం తెలియజేయడానికి పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్‌తో యూఎస్ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ అల్లిసన్ ఎం హుకర్ మాట్లాడారు. అమెరికా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుందని.. తాలిబాన్ దాడుల నుంచి పాక్ తనను తాను రక్షించుకునే హక్కు పాక్‎కు ఉందన్నారు.