ఒప్పందమా.. దాడులా.. 24 గంటల్లో తేలిపోద్ది: ఇరాన్‌తో డీల్‎పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఒప్పందమా.. దాడులా.. 24 గంటల్లో తేలిపోద్ది: ఇరాన్‌తో డీల్‎పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో శనివారం జరిగే చర్చలు విఫలమైతే ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించేందుకు తమ యుద్ధనౌకలు రెడీగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డీల్ గురించి మరో 24 గంటల్లో తేలిపోంతుందని.. ఏం జరగబోతుందో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. ‘న్యూయార్క్ పోస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ‘మా యుద్ధనౌకలను ప్రపంచంలోనే బెస్ట్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో నింపుతున్నాం. గతంలో చేసిన దానికంటే ఇప్పుడు మరింత శక్తివంతంగా దాడులు చేస్తాం. 

ఒకవేళ ఇస్లామాబాద్ చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఆ ఆయుధాలతో ఇరాన్‎పై విరుచుకుపడతాం’ అని హెచ్చరించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ మాట్లాడుతూ..చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కానీ, ఇరాన్ గేమ్ ఆడాలని చూస్తే మాత్రం అమెరికా చర్చల బృందం అంత సులభంగా లొంగదని స్పష్టం చేశారు. తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

ఇస్లామాబాద్‌లో చర్చలు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు శనివారం పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధి బృందాలు భేటీ కానున్నాయి. ఇస్లామాబాద్‌ వేదికగా ప్రారంభం కానున్న ఈ చర్చల్లో ఇరుపక్షాల నుంచి ప్రముఖులు పాల్గొంటున్నారు. అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు వైట్ హౌస్ నుంచి జారెడ్ కుష్నర్(ట్రంప్ అల్లుడు), స్టీవ్ విట్కాఫ్ (ప్రత్యేక రాయబారి)లతో కూడిన సుమారు 30 మంది సభ్యుల భద్రతా, దౌత్య నిపుణుల బృందం ఇప్పటికే పాక్ బయలుదేరింది. 

ఇక, ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ బాఘేర్ ఖలిబాఫ్ చర్చలకు నాయకత్వం వహించనున్నారు. అబ్బాస్ అరాగ్చి(ఇరాన్ విదేశాంగ మంత్రి)తో పాటు పలువురు అత్యంత శక్తిమంతమైన దౌత్య, రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. వీరితో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విడివిడిగా సమావేశమై చర్చలు సజావుగా సాగేలా మధ్యవర్తిత్వం వహించనున్నారు. అమెరికా, ఇరాన్ కు చెందిన అత్యంత కీలకమైన వ్యక్తులు చర్చలకు అటెండ్ కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

దిగ్బంధంలో  'రెడ్ జోన్' ఏరియా

అమెరికా, ఇరాన్ ప్రతినిధుల చర్చలు జరగనున్న ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనా, విదేశీ రాయబార కార్యాలయాలు ఉండే 'రెడ్ జోన్' ఏరియాను పాక్ భద్రతా దళాలు ఇప్పటికే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ట్రాఫిక్‎ను నియంత్రించడానికి ప్రధాన రహదారులన్నింటినీ కంటైనర్లు, బారికేడ్లతో మూసివేశారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిచ్చారు. 

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గత రెండురోజులుగా పబ్లిక్ హాలిడేను అమలు చేస్తున్నారు. ఈమేరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపైనే కాకుండా గగనతలంలో కూడా పాక్ వైమానిక దళం నిరంతరం గస్తీ కాస్తోంది. ాడుల భయంతో గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.