రియల్టర్ అవతారం ఎత్తుతోన్న సర్కార్

రియల్టర్ అవతారం ఎత్తుతోన్న సర్కార్
  • ఆదాయం కోసం వెంచర్లు, లేఅవుట్లు వేసే బిజినెస్​
  • పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీం అమలు
  • విధి విధానాలు రూపొందించాలనిమున్సిపల్ అధికారులకు ఆదేశం
  • ఆస్తుల విలువ.. రిజిస్ట్రేషన్​ చార్జీల పెంపు
  • రెసిడెన్షియల్​ స్కూళ్లలో స్థానికులకు 50 శాతం సీట్లు
  • జీహెచ్​ఎంసీ శివారు మున్సిపాల్టీల్లో తాగునీటికి రూ.1200 కోట్లు
  • కేబినెట్​ భేటీలో నిర్ణయాలు
  • ఇయ్యాల మళ్లీ సమావేశం కానున్న మంత్రివర్గం

హైదరాబాద్, వెలుగు:ఖల్లాస్ అయిన ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర సర్కార్ రియల్టర్​ అవతారం ఎత్తుతోంది. నేరుగా ల్యాండ్​ డెవలప్​మెంట్, లే అవుట్లతో రియల్​ఎస్టేట్ బిజినెస్ కు రెడీ అయింది. సిటీలు, పట్టణాల శివారు ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తుల భూముల్లో లేఅవుట్లు, వెంచర్లు వేసే పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో ఈ తరహా బిజినెస్‌ చేపట్టిన సర్కార్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో వ్యాపారం విస్తరించాలని నిర్ణయించింది. పట్టణాల పరిధిలో ‘ల్యాండ్ పూలింగ్’ పద్ధతి ద్వారా లే అవుట్ల డెవలప్​మెంట్​కు సంబంధించిన అవకాశాలను, విధి విధానాలను రూపొందించాలని మున్సిపల్ శాఖ అధికారులను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఏడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది.  హెచ్​ఎండీఏ పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రకారం.. తమ భూమిని వెంచర్‌గా డెవలప్​ చేయాలని ఆసక్తి ఉన్న భూ యజమానులతో ఆయా అర్బన్ డెవలప్​మెంట్ సంస్థలు అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఇందులో భాగంగా ‘నాలా’ చార్జీలతో పాటు భూ వినియోగ మార్పు చార్జీలు ఆయా సంస్థలే భరిస్తాయి. 

ల్యాండ్​ పూలింగ్ స్కీమ్ కోసం భూములు ఇచ్చిన వారి రిజిస్ట్రేషన్​ ఖర్చులను కూడా పట్టణాభివృద్ధి సంస్థలే చెల్లిస్తాయి. లే అవుట్ అప్రూవల్ అయ్యాక ఆరు నెలల్లోపే కొన్ని ప్లాట్లను భూమి యజమానులకు ఇచ్చి, మరికొన్నింటిని పట్టణాభివృద్ధి సంస్థలు వేలం వేస్తాయి. ల్యాండ్ ఓనర్లు తమకు కేటాయించిన ప్లాట్లను వారి ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు. గతంలో హెచ్​ఎండీఏ లేఅవుట్ చేస్తే సగం ప్లాట్లను ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి, మిగతా సగం ప్లాట్లను వేలం వేసేది. 2020 జూన్‌లో ఈ శాతంలో మార్పులు చేసింది. భూ యజమానులకు 60 శాతం, హెచ్​ఎండీఏకు 40 శాతం కేటాయించాలని ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో 
ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు డెవలప్​ అవుతున్నాయి. 

ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు

భూములు, ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై అధికారులు ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ రెడీ చేశారు. కిందటేడాది ఫిబ్రవరిలో సబ్ రిజిస్ట్రార్లు కమిషనర్​ కు సమర్పించిన మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా నాన్​అగ్రికల్చర్ భూముల విలువలు ఏరియాను బట్టి ఇప్పటి కంటే గరిష్టంగా 50 శాతం పెంచనున్నట్లు సమాచారం. అగ్రికల్చర్ ల్యాండ్స్ వాల్యూ కూడా ప్రాంతాల వారీగా 20 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశముంది. భూములు, ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ సందర్భంగా ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతం కలిపి మొత్తంగా 6 శాతం చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిని కూడా 7 శాతానికి పెంచనున్నట్లు తెలిసింది.

రెసిడెన్షియల్ స్కూళ్లలో 50 శాతం లోకల్

ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్‌లను విధిగా ఆహ్వానించాలని ఆదేశించింది.

శివారు  మున్సిపాలిటీలకు రూ.1200 కోట్లు

హైదరాబాద్ సిటీ శివారులోని మున్సిపాలిటీలలో తాగునీటి సమస్యపై కేబినెట్‌లో చర్చించారు. నీటి సమస్యను అధిగమించేందుకు రూ.1200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

నెల రోజుల్లో వైకుంఠ ధామాలు

వైకుంఠధామాల నిర్మాణాలను వచ్చే నెల రోజుల్లో పూర్తి చేయాలని కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో, వీధి దీపాల కోసం ‘మూడో వైర్’ తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.

మళ్లీ ఫీవర్ సర్వే చేయండి

కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ఇదివరకే హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు అన్ని రకాల అనుమతులు ఇచ్చామని, వెంటనే ఫీవర్‌ సర్వే చేయడంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను  మంత్రివర్గం ఆదేశించింది.

భూముల విలువ పెంపు

భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలను కూడా పెంచబోతున్నారు. కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాము చెప్పే వరకు ఆఫీసులు వదిలి వెళ్లొద్దని జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు ఉదయం అత్యవసర ఆదేశాలు రావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు అమల్లోకి వస్తాయనే ప్రచారం జరిగింది. కానీ రాత్రి 7 గంటలకు రిజిస్ట్రేషన్ల శాఖ  ఆఫీసర్ల నుంచి ‘మీరు వెళ్లిపోవచ్చు. మీకు ఎలాంటి టాస్క్​ లేదు..’ అని జిల్లా రిజిస్ట్రార్లకు సమాచారం వచ్చింది. అయితే చార్జీల పెంపుపై ఏ క్షణమైనా జీవో విడుదల కావచ్చని చెప్తున్నారు.