V6 News

అక్టోబర్​లో గ్రూప్ 3 ఎగ్జామ్ .. టీఎస్​పీఎస్సీ కసరత్తు

అక్టోబర్​లో గ్రూప్ 3 ఎగ్జామ్ .. టీఎస్​పీఎస్సీ కసరత్తు
  • 1,388 పోస్టుల భర్తీకి త్వరలో పరీక్ష తేదీల ప్రకటన

హైదరాబాద్, వెలుగు: అక్టోబర్​లో గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టేందుకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్ నిర్వహించగా.. గ్రూప్ 2 ఆగస్టులో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే, గ్రూప్3 ఎగ్జామ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. పోయిన ఏడాది డిసెంబర్ 29న 1,363 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ ను టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేసింది. ఫిబ్రవరిలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మరో 12 పెంచింది. తాజాగా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీరింగ్ విభాగంలో 13 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో గ్రూప్ 3 ద్వారా మొత్తం 1,388 పోస్టులు భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రధానమైన ఎగ్జామ్స్ తేదీలన్నీ ప్రకటించిన టీఎస్​పీఎస్సీ.. గ్రూప్ 3 డేట్లను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ఈ పరీక్ష రాసేందుకు అప్లై  చేసుకున్న 5,36,477 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. 

ప్రిపరేషన్​కు టైమివ్వాలనే..

గ్రూప్ 3 ఎగ్జామ్ రెండ్రోజుల పాటు మూడు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న చాలా మంది గ్రూప్ 3కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు నెలాఖరులో ఉండటంతో, వారికీ కొంత ప్రిపరేషన్ కు టైమ్ ఇవ్వాలని టీఎస్​పీఎస్సీ భావిస్తున్నది. కనీసం నెలన్నర నుంచి రెండు నెలల గడువు ఇవ్వాలనుకుంటున్నది. అందుకే, అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో గ్రూప్ 3 నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. అయితే, అక్టోబర్ మొదటి రెండు వారాల్లో యూపీఎస్​సీ, బ్యాంక్, రైల్వేతో పాటు ఇతర నేషనల్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలను టీఎస్​పీఎస్సీ సేకరిస్తున్నది. ఒకవేళ ఈ తేదీల్లో సాధ్యంకాకపోతే స్కూల్స్​కు దసరా సెలవులు ఇచ్చిన టైంలో పెట్టే యోచనలో అధికారులున్నారు. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు ఉండటంతో సెంటర్లకు ఇబ్బంది లేకున్నా.. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది పరంగా ఏమైనా సమస్య వస్తుందా అని ఆలోచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులతోనూ టీఎస్​పీఎస్సీ చర్చించినట్టు తెలిసింది.