స్పైస్ బోర్డు లోనే పసుపు బోర్డు నిధులు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

స్పైస్ బోర్డు లోనే పసుపు బోర్డు నిధులు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
  • రాజ్య సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో స్పైస్ బోర్డుకు కేటాయించిన నిధుల్లోనే నిజామాబాద్ పసుపు బోర్డు వాటా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ విషయంపై బుధవారం రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారన్నారు. దీనిపై గురువారం ఆమె కీలక వివరణ ఇచ్చారు. ‘‘వాస్తవానికి పసుపు బోర్డుకు సంబంధించిన కేటాయింపులు స్పైస్ బోర్డు కేటాయింపుల్లో అంతర్భాగంగా ఉంటాయి. 

ఈ ఏడాది బడ్జెట్‌‌లో స్పైస్ బోర్డు కోసం రూ. 156.89 కోట్లను కేటాయించాం. కాబట్టి పసుపు బోర్డుకు నిధులు అందవన్న మాటలో అర్థం లేదు”అని సమాధానం ఇచ్చారు. కేవలం పసుపు బోర్డు మాత్రమే కాకుండా, ఆహారం, ఎరువులు, పెట్రోలియం వంటి రంగాలకు ఇచ్చే ప్రధాన సబ్సిడీలను గత ఏడాది కంటే ఈసారి భారీగా పెంచినట్లు తెలిపారు.  

నేషనల్ హైవే 65 అలైన్మెంట్​కు ఆమోదం 

హైదరాబాద్‌‌–విజయవాడ నేషనల్ హైవే –65ని 6 లేన్లుగా విస్తరించేందుకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించి సుమారు 230 కి.మీ. మేర అలైన్‌‌మెంట్‌‌ను ఆమోదించినట్లు, డీపీఆర్‌‌ తయారీకి కన్సల్టెంట్‌‌ను కూడా నియమించినట్లు తెలిపింది. అలాగే హైదరాబాద్‌‌ – శ్రీశైలం (ఎన్ హెచ్ -765) మార్గంలో 4 లేన్ల ఎలివేటెడ్‌‌ కారిడార్‌‌ నిర్మాణానికి కూడా డీపీఆర్‌‌ రెడీ అవుతోందని పేర్కొంది. 

ఈ ప్రాజెక్టు ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా పంచుకునేందుకు అంగీకరించిందని గురువారం లోక్ సభలో ఒక ఎంపీ ప్రశ్నకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాతపూర్వక సమాధానం 
ఇచ్చారు.  

శంషాబాద్​లో రద్దీకి తగ్గట్టు సౌలతులు  

శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని ఏడాదికి 1.2 కోట్ల (12 ఎంపీపీఏ) నుంచి 3.4 కోట్లకు 34 ఎంపీపీఏ) పెంచినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. కార్గో టెర్మినల్-2, ట్రాన్సిట్ లాంజ్ పనులతో కలిపి దాదాపు రూ.1,325 కోట్లు ఖర్చు చేసినట్లు ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే బేగంపేట ఎయిర్‌‌పోర్టులోనూ రూ.42 కోట్లతో రన్‌‌వే రీ-సర్ఫేసింగ్, పెరిమీటర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు.