సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని, అమాయక మహిళలను మోసగిస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసులు. కుత్బుల్లాపూర్ పరిధిలో స్నాప్‌చాట్ వేదికగా మహిళలను నమ్మించి, భారీగా బంగారం కాజేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
ప్రధాన నిందితుడు సాగర్ చౌదరి అలియాస్ సాయి సునీల్, అతనికి సహకరించిన శివంగుల భరత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెంటల్ లగ్జరీ కార్లలో తిరుగుతూ, తాము పెద్ద శ్రీమంతులమంటూ బిల్డప్ ఇస్తూ వీరు స్నాప్‌చాట్‌లో మహిళలకు వల వేసేవారు.
నమ్మకం కుదిరిన తర్వాత వివిధ రకాలుగా మహిళలను మోసం చేసి వారి నుంచి బంగారం ఎత్తుకెళ్లేవారు. ఆ తర్వాత ఆ బంగారాన్ని భరత్ కుమార్ ద్వారా మార్కెట్లో విక్రయించేవారు. ఇప్పటివరకు ఈ మోసగాళ్ల వలలో పడిన 20 మంది మహిళలను గుర్తించిన పోలీసులు.. వారి నుంచి దాదాపు 35 నుంచి 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు సాగర్‌పై గతంలో ఆర్సీ పురం, ఎల్బీ నగర్ పరిధిలో పలు చీటింగ్ కేసులతో పాటు.. ఒక రేప్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు. ఈ మోసాల్లో మరికొందరు బాధితులు ఉండే అవకాశం ఉందన్న కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.
