కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరు మృతి

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం..  ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్ మండలం చెంజర్ల శివారులో ఆర్టీసీ బస్సు, కారు  ఢీకొన్నాయి.  ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో కరీంనగర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో చెంజర్ల వద్ద కారు రాంగ్ రూట్‌లో వెళ్తోంది.. అదే సమయంలో కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా జాతీయ రహదారులపై రాంగ్ రూట్‌లో వెళ్లడం ప్రాణాంతకమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.