జీడిమెట్ల రాంరెడ్డినగర్​ సిలిండర్ పేలుడుపై  అనుమానాలు

జీడిమెట్ల రాంరెడ్డినగర్​ సిలిండర్ పేలుడుపై  అనుమానాలు

జీడిమెట్ల,వెలుగు: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు కార్మికులు చనిపోయిన కేసు దర్యాప్తులో జీడిమెట్ల పోలీసులు వేగం పెంచారు. ఇద్దరినీ ముందుగానే  చంపి తర్వాత గ్యాస్ లీకేజీ చేసి నిప్పటించినట్లుగా అనుమానిస్తున్నారు. జీడిమెట్ల పరిధి రాంరెడ్డినగర్​లో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలో జార్ఖండ్​కు చెందిన ఇద్దరు కార్మికులు ఇబాదత్ అన్సారీ(20), బీరేందర్ కుమార్ సింగ్ (30) చనిపోయిన సంగతి తెలిసిందే. మొదట సిలిండర్లు పేలి చనిపోయినట్లు పోలీసులు భావించారు. కానీ ఉదయం కార్మికులు గొడవపడినట్లు స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. మృతుల్లో ఒకరికి చాప చుట్టి ఉండటం, మరో వ్యక్తి ఒంటిపై గాయాలుండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. 3 స్పెషల్ టీమ్స్​తో విచారణ కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాంరెడ్డినగర్ లోని ఓ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉండే  జార్ఖండ్​కు చెందిన 8 మంది కార్మికులు మేఘా ఇంజనీరింగ్ కంపెనీలో ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మంగళవారం భువనేశ్వర్ సింగ్ అనే మరో కొత్త వ్యక్తి వీరు ఉంటున్న రూమ్​కు రావడంతో గొడవ మొదలైందని స్థానికులు చెప్తున్నారు. 

ఉదయం నుంచి గొడవ, అరుస్తున్న శబ్ధాలు వినిపించాయంటున్నారు. రాత్రి 8 గంటలకు సిలిండర్ పేలిన శబ్ధం రావడంతో వెంటనే కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇబాదత్ అన్సారీ, బీరేందర్ అనే ఇద్దరు కార్మికులు చనిపోయినట్లు గుర్తించారు.  రూమ్​లో 4 గ్యాస్ ​సిలిండర్స్​ ఉండటం, బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానాలు తలెత్తాయి. ఉదయం గొడవ జరిగిన టైమ్​లో రూమ్​లో  5 మంది ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ సింగ్ ఇద్దరు కార్మికులను చంపి గ్యాస్ లీక్ చేసి చేసి రూమ్ బయట గడియపెట్టి  నిప్పంటించి వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. అదే టైమ్​లో ఇద్దరు కార్మికులు కిటికీలో నుంచి దూకి పారిపోవడాన్ని తాము చూశామని మరికొందరు అంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భువనేశ్వర్ సింగ్​నలుగురు కార్మికులను రూమ్​లోనే ఉంచి నిప్పుపెట్టడానికి ప్రయత్నిం చగా వారు తప్పించుకున్నారా? లేక భువనేశ్వ ర్ తో పాటు మరో ఇద్దరు కార్మికులు కలిసి ఇబాదత్ అన్సారీ, బీరేందర్​ను  చంపి  గ్యాస్​ లీక్ ​చేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశారా? అనే కోణంలో క్లూస్ టీమ్ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భువనేశ్వర్ సింగ్ పరారీలో ఉన్నాడన్నారు.  పోలీసులు  ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం, క్లూస్ టీమ్ రిపోర్టు వస్తే దర్యాప్తులో మరింత వేగం పెరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.