చత్తీస్​గఢ్తో కరెంట్ కొనుగోలు ఒప్పందం ఇదే

చత్తీస్​గఢ్తో   కరెంట్ కొనుగోలు ఒప్పందం ఇదే

చత్తీస్​గఢ్  కరెంటు కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి పది రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా సేకరించడానికి విద్యుత్ రంగ నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇందుకోసం బహిరంగ ప్రకటన విడుదల చేసింది.

చత్తీస్​గఢ్ ఒప్పందం ఇదే..

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నాటి బీఆర్ఎస్ సర్కారు చత్తీస్​గఢ్ తో కరెంటు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలాంటి ఓపెన్​ టెండర్లు లేకుండానే రెండు రాష్ట్రాల మధ్య ఈ అగ్రిమెంట్ జరిగింది. యూనిట్ కు రూ.3.90కే కరెంటు సరఫరా అవుతుందని చెప్పినా.. కేవలం పవర్ జనరేషన్ ప్లాంట్ దగ్గరే రూ.3.90 రేటు అంటూ ఒప్పందంలో మెలిక పెట్టారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్​మిషన్, ఫ్యుయల్ ఖర్చులు అన్నీ కలిపి అదనంగా రూ1.50 వరకు చార్జ్ చేసి ఒక యూనిట్ కరెంటును రూ.5.50కు కొన్నట్టు విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే ఓపెన్ టెండర్లు పిలిచి ఉంటే మన రాష్ట్రం సరిహద్దు వరకు వచ్చి మరీ రూ.4 కే యూనిట్​కరెంటు ఇచ్చే పరిస్థితి ఉండేదని అంటున్నారు. ట్రాన్స్ మిషన్ కోసం నేషనల్ కారిడార్ కిరాయి తీసుకోవడంతో సరఫరా పూర్తి స్థాయిలో రాకపోయినా లైన్​కు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఏరోజుకు ఆ రోజు డిమాండ్ ను బట్టి యూనిట్​కు రూ.6, రూ.7, రూ.10, రూ.20 వరకు చెల్లించి కరెంటు కొనుగోలు చేశారు. 

ముందే చెప్పినా వినలే.. 

చత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏండ్ల అగ్రిమెంట్ టైమ్​లో రూ.12 వేల కోట్ల అదనపు భారం పడనుందని అప్పట్లోనే విద్యుత్ రంగ నిపుణుడు రఘు ఈఆర్సీకి వివరించారు. కానీ, చత్తీస్ గఢ్ నుంచి చౌకగానే విద్యుత్ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని నాటి బీఆర్ఎస్ సర్కారు ఈఆర్సీని కోరింది. అయితే గతేడాది రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి ఇచ్చిన రిపోర్టులో రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతున్నదని అంగీకరించడం గమనార్హం.

కరెంటు ఒప్పందం జరిగిందిలా..

చత్తీస్​గఢ్​లోని మార్వా థర్మల్ పవర్ ప్లాంట్​నుంచి 12 ఏండ్లపాటు కరెంటు కొనుగోలుకు తెలంగాణ డిస్కంలు, చత్తీస్​గఢ్ కు చెందిన సీఎస్పీడీసీఎల్ మధ్య 2015 సెప్టెంబర్ 22న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగింది. ఓపెన్ టెండర్లకు బదులుగా తెలంగాణ, చత్తీస్​గఢ్ రాష్ట్రాల సీఎంల సమక్షంలో 2014 నవంబర్ 3న జరిగిన మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్​(ఎంవోయూ) ఆధారంగా ఈ పీపీఏ చేసుకున్నారు. చత్తీస్ గఢ్ విద్యుత్ తో జరగనున్న నష్టంపై అప్పటి ఎనర్జీ సెక్రటరీ అర్వింద్​కుమార్ టీఎస్ ఈఆర్సీకి 2016 డిసెంబర్​లో లెటర్ రాశారు. దీంతో ఆగ్రహించిన గత బీఆర్ఎస్ సర్కారు ఆయనను ట్రాన్స్​ఫర్ చేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్​గా పంపింది. ఆ తర్వాత చిన్ని చిన్న మార్పులతో టీఎస్ ఈఆర్సీ 2017 మార్చి 31న అమలుచేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.