బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనను నిజామాబాద్ వరకే పరిమితం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మాట్లాడకుండా తనపై ఆంక్షలు విధించారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎంజీఎంను గాలికి వదిలేశారని విమర్శించారు. కొత్తగా కడుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తుంది హరీష్ రావు బినామీ కాంట్రాక్టు కంపెనీనే అని చెప్పారు. అందులో అవినీతి అక్రమాలు జరిగాయనే కారణాలతో విజిలెన్స్ ఎంక్వయిరీ వేశారన్నారు. ఈ విషయంలో ఏదో ఒకటి చేసి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. గతంలో వీటీడీఏ ద్వారా టెండర్లు ఇచ్చారని .. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టు ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క మౌనంగా ఉండడం సరికాదన్నారు. వరంగల్ వరదల్లో మునిగిన వారికి ఇంకా పరిహారం అందలేదన్నారు. ముఖ్యమంత్రి పర్యటించి 15రోజులైనా పరిహారం అందలేదని తెలిపారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ లేకపోవడం దారుణమన్నారు. సమ్మక్క - సారక్క లెక్క జిల్లాలో మంత్రులు సీతక్క, సురేఖ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాకతీయ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలన్నారు. ఎంజీఎంను ప్రభుత్వం విస్మరించిందన్నారు.
