చైనా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ

చైనా సరిహద్దుల్లో  ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ
  •  
  • అస్సాంలో ప్రారంభించిన ప్రధాని  నరేంద్ర మోదీ
  • రూ.100 కోట్లతో మోరాన్ బైపాస్ వద్ద 4.2 కిలోమీటర్ల మేర నిర్మాణం
  • ఇది చైనా బార్డర్​కు 300 కిలో మీటర్ల దూరం
  • 40 టన్నుల బరువున్న ఫైటర్ జెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 74 టన్నుల 
  • బరువున్న భారీ రవాణా విమానాలు ఈజీగా ల్యాండింగ్

గువాహటి:  గత కాంగ్రెస్‌‌ పాలనలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలో తిరుగుబాటు ధోరణులను ప్రోత్సహించారని, దేశ విభజనకు మద్దతిచ్చే తుక్డే గ్యాంగ్‌‌కు కాంగ్రెస్‌‌ మద్దతిచ్చిందని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరగబోయే అస్సాంలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. మోరాన్ సమీపంలోని జాతీయ రహదారి-–37పై ఏర్పాటు చేసిన ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ’ (ఈఎల్‌‌ఎఫ్‌‌)ని ప్రారంభించారు.  సీ130జే సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానంలో దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. చబువా ఎయిర్‌‌ఫీల్డ్ నుంచి బయలుదేరిన ప్రధాని, నేరుగా హైవేపై ల్యాండ్ అయ్యారు. అనంతరం సుమారు రూ. 5,450 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతు, ఐఐఎం గువాహటి  తాత్కాలిక క్యాంపస్‌‌,  నేషనల్ డేటా సెంటర్‌‌‌‌లాంటి కీలక ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా గువాహటిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

దేశ భద్రతను పణంగా పెట్టింది

కాంగ్రెస్ తన హయాంలో దేశ భద్రతను పణంగా పెట్టిందని, అస్సాంలో అప్పట్లో భయం, అభద్రత నెలకొనేలా చేసిందని  ప్రధాని మోదీ విమర్శించారు. దేశ విభజనకు ముస్లిం లీగ్ కారణమైతే, ప్రస్తుతం ఎంఎంసీ (మావోయిస్టు, ముస్లిం, కాంగ్రెస్) కూటమి ప్రమాదకరంగా మారిందన్నారు. అక్రమ వలసలను అరికట్టడానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వచ్చే ఐదేండ్లు రాష్ట్రానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత ఏడు దశాబ్దాల్లో బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మిస్తే, బీజేపీ ప్రభుత్వం పదేండ్లలోనే 5 బ్రిడ్జిలను నిర్మించిందని వివరించారు. దేశం కొత్త దశలోకి ప్రవేశించిందని, ఇది నయా భారత్‌‌ అని పేర్కొన్నారు.  పుల్వామా ఘటన జరిగిన రోజు సందర్భంగా.. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన  అమరు జవాన్లకు మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఆపరేషన్​ సిందూర్‌‌‌‌తో మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించామన్నారు.

 ఈఎల్‌‌ఎఫ్‌‌ ప్రత్యేకతలివే..

ఈఎల్‌‌ఎఫ్‌‌ను రూ. 100 కోట్ల వ్యయంతో మోరాన్ బైపాస్ వద్ద 4.2 కిలోమీటర్ల మేర  అత్యంత పటిష్టంగా నిర్మించారు.  ఇది చైనా సరిహద్దుకు 300 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. 40 టన్నుల బరువున్న ఫైటర్ జెట్స్‌‌, 74 టన్నుల బరువున్న భారీ రవాణా విమానాలు ఇక్కడ సురక్షితంగా ల్యాండ్ అవుతాయి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డిబ్రూగఢ్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌, చబువా ఎయిర్‌‌ఫోర్స్ స్టేషన్లలో కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే.. ఈ ఈఎల్‌‌ఎఫ్‌‌ను ఒక ప్రత్యామ్నాయంగా వాడతారు.  సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు.. ఇండియన్‌‌ ఎయిర్‌‌‌‌ఫోర్స్​ స్పందించేందుకు వీలవుతుంది. టేకాఫ్‌‌, ల్యాండింగ్‌‌కు అనుకూలంగా దీనిని డిజైన్ చేశారు. పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో ఇప్పటికే ఈ ఈఎల్‌‌ఎఫ్‌‌లు ఉన్నాయి. చైనాతో వివాదాల వేళ ఈశాన్య భారతంలో దీన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.