పుల్కల్, వెలుగు: ప్రజలకు సేవలను మరింత సులభతరం చేసేందుకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామంలో వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీలో వివిధ శాఖలకు మంత్రిత్వ కేబినేట్ ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డిపేట గ్రామ సర్పంచ్ కుమ్మరి అనసూయ లింగయ్య ఆధ్వర్యంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు.
ఈ సభలో సమస్యల పరిష్కారానికి వివిధ శాఖలకు సంబంధించి 10 మంది వార్డు మెంబర్లను మంత్రులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం మాదిరిగా గ్రామస్థాయిలో ఈ కేబినెట్ ప్రజాసేవలో పనిచేస్తుందని సర్పంచ్ చెప్పారు.
దేవాలయ, వ్యవసాయ శాఖలు అనిత రామచందర్, తాగునీటి శాఖ నదరి కమలమ్మ మల్లేశం, పారిశుధ్య శాఖ చాకలి ఎల్లయ్య, రెవెన్యూ, పింఛన్ శాఖ శశికళ మహేశ్, మైనింగ్, మార్కెటింగ్ శాఖ రాములమ్మ అంజయ్య, విద్యుత్ శాఖ ఆకుల యాదుల్, హోమ్, ఎక్సైజ్ శాఖ ఎర్ర మల్లేశం, రోడ్లు, గృహనిర్మాణ శాఖ నరేశ్, విద్య, ఉపాధి శాఖలు కొత్తగాడి విజయ్, పరిపాలన విప్ గా తలారి రవి ఎంపికయ్యారు.
నూతన మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండి శాఖల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అలాగే సర్వే నంబర్లు 255, 257, 261లోని 2.23 ఎకరాల ప్రభుత్వ భూమిలో అర్హులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తీర్మానించారు. గ్రామాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్ది, అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా మార్చుతామని సర్పంచ్ అనసూయ లింగయ్య తెలిపారు.
