బెంగళూరు జైల్లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ఖైదీ.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్..

బెంగళూరు జైల్లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ఖైదీ.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్..

బెంగళూరు సెంట్రల్ జైలులో పెద్ద లోపం బయటపడింది. ISIS ఉగ్రవాద సంస్థ కోసం మనుషులను చేర్చుకునే జుహాబ్ హమీద్ షకీల్ మన్నా అనే ఖైదీ జైలు లోపల స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన జైలు నిఘా, భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది.

వివరాల ప్రకారం నవంబర్ 8న పోస్ట్ చేసిన ఈ వీడియోలో 2018 నుండి ISIS కోసం డబ్బులు సేకరించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న మన్నా  హై సెక్యూరిటీ ఉండే జైలులోనే ఫోన్ వాడుతూ కనిపించాడు. ఈ ఫుటేజ్ బయటకు రావడంతో జైలులో ఖైదీలకు అనధికారికంగా సమాచారం బయటికి పంపే అవకాశం ఉందా అనే కోణంలో దర్యాప్తు తీవ్రమైంది.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శేష్ పాల్ వైద్ ఈ విషయంపై స్పందిస్తూ  భారతీయ జైళ్లు ఇప్పటికీ  ప్రభుత్వం పట్టించుకోని విభాగంగా మిగిలిపోయాయని, వాటిలో శిక్షణ, మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన సంస్కరణలు తీసుకురావాలని ఆయన కోరారు.

అధికారుల సస్పెన్షన్ :
మన్నాకు స్మార్ట్‌ఫోన్ ఎలా దొరికిందనే దానిపై కర్ణాటక అధికారులు  విచారణ జరుపుతున్నారు. అయితే, ఇంతకుముందు కూడా ఇదే జైలులో దోషిగా తేలిన సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి మొబైల్‌లో ఐటెం సాంగ్ చూస్తున్న వీడియో కూడా పోస్ట్ అయ్యింది. అంటే, జైలు పర్యవేక్షణలో పదేపదే లోపాలు ఉన్నాయని తెలుస్తోంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2023 నివేదిక ప్రకారం, భారతదేశంలోని ఐదో వంతు జైళ్లు మొబైల్ ఫోన్ల అక్రమ రవాణా సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ జైలులో అక్టోబర్ 2025లో ఒక వార్డెన్ ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తీసుకెళ్తూ పట్టుబడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

భద్రతా చర్యలను మెరుగుపరచడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతంలో 'మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ చట్టం 2023'ను తెచ్చినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో దీని అమలు తీరులో ఉన్న తేడాలు జైలు నిర్వహణలోని లోపాలను చూపిస్తూనే ఉన్నాయి.