హైదరాబాద్ లో తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు అరెస్ట్.. 2 పిస్టళ్లు, 7 బుల్లెట్లు స్వాధీనం

హైదరాబాద్ లో తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు అరెస్ట్.. 2 పిస్టళ్లు, 7 బుల్లెట్లు స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: మారణాయుధాలతో తిరుగుతున్న ఇద్దరిని హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మైలార్‌‌దేవ్‌‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 2 దేశీ పిస్టల్స్, 7 బుల్లెట్లు, బలెనో కారు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

సికింద్రాబాద్‌‌లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కొందరు వ్యక్తులు మైలార్‌‌దేవ్‌‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బలెనో కారులో తిరుగుతూ నేరాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. టాస్క్ ఫోర్స్, మైలార్‌‌దేవ్‌‌పల్లి పోలీసులు సంయుక్తంగా మెహిఫిల్ హోటల్ సమీపంలో వాహనాన్ని అడ్డుకుని తనిఖీలు చేపట్టారు.

 కారులో ఉన్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చార్మినార్ కిల్వత్‌‌కు చెందిన ముదస్సిర్ హుస్సైన్ అలియాస్ షా బాబా(24), మహారాష్ట్రలోని నాందేడ్‌‌కు చెందిన అమీర్ ఖాన్(26)గా గుర్తించారు. తుపాకులతో ప్రజలను బెదిరించి దోపిడీలు చేసేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు డీసీపీ తెలిపారు. వారిపై కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్‌‌లో కేసులు ఉన్నాయి.