రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఒకే చోట ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఒక ఫామ్‌హౌస్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఈ మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
ఇటీవల వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఒకరు, యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మహిళ అదృశ్యమవగా.. వారిని దుండగులు ఇక్కడికి తీసుకొచ్చి, దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రూరమైన ఘటనపై తాండూరు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు.విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు కీలక ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. ఫైనాన్స్ వివాదాల కారణంగానే ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తాండూరు నుంచి మొయినాబాద్ వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనే కోణంలో విచారిస్తున్నారు.
