హైదరాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పాతబస్తీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తీలోని బండ్లగూడ వద్ద విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడిపోయాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు.. ఆటో దిగిన వెంటనే కింద పడి ఉన్న లైవ్ కరెంట్ వైర్లను గమనించలేకపోయారు. వర్షపు నీటిలో మునిగి ఉన్న ఆ విద్యుత్ తీగలపై కాలు పెట్టడంతో... క్షణాల వ్యవధిలోనే ఇద్దరికీ తీవ్రంగా కరెంట్ షాక్ కొట్టింది. ఘటనా స్థలంలోనే ఆ ఇద్దరు యువకులు ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్ (25), అబూ (16)గా పోలీసులు గుర్తించారు. కంటి ముందే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని సరఫరాను నిలిపివేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు వర్షం కారణంగా ఇలా మృత్యువాత పడడంతో.. చాంద్రాయణగుట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి..
►ALSO READ | వాన బీభత్సం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపై నీరు నిలిచినప్పుడు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని... ఎక్కడైనా వైర్లు తెగిపడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
