వాన బీభత్సం.. ఐటీ కారిడార్ టూ సికింద్రాబాద్ ,ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి రూట్లలో ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు

వాన బీభత్సం.. ఐటీ కారిడార్ టూ సికింద్రాబాద్ ,ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి రూట్లలో ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు

హైదరాబాద్ లో భారీ వర్షానికి  పలు ప్రధాన రూట్లలో  ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ నుంచి కూకట్ పల్లి, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రూట్, ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి,  తెలంగాణ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్,  వైపు రహదారులన్నీ నీరు నిలిచి  ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.. ట్యాంక్ బండ్ పై భారీ వృక్షం కూలిపోవడంతో.. ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పైన వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి.  వర్షం తగ్గడంతో ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  ఇందిరా పార్క్ రూట్ లో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. 

►ALSO READ | హైదరాబాద్‌ లో దంచికొట్టిన వాన.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..గంటలోనే 8 సెం.మీ రికార్డు వర్షపాతం

 బషీర్ బాగ్, హైదర్‌గూడ రోడ్లయితే ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయానికే వాన దంచికొట్టడంతో... ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే నరకయాతన అనుభవిస్తున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ (DRF) సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు... రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు, కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

నగరవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే... అత్యధికంగా ముషీరాబాద్, బన్సీలాల్ పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హిమాయత్ నగర్, GHMC ఆఫీస్ పరిసరాల్లో 7.8 సెంటీమీటర్లు... లిబర్టీలో 6.4, మెట్టుగూడలో 5.7, అడిక్‌మెట్‌లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఆసిఫ్ నగర్, నాంపల్లిలో 5.5... షేర్లింగంపల్లి, మియాపూర్‌లలో 5.3 సెంటీమీటర్ల వాన పడింది. ఉస్మానియా యూనివర్సిటీ, కూకట్‌పల్లి, బాలాజీ నగర్, సికింద్రాబాద్ పరిసరాల్లో 5 సెంటీమీటర్ల వర్షం కురవగా... చిలకలగూడ, సీతాఫల్‌మండి, మారేడుపల్లి, అంబర్‌పేట్, షేక్‌పేట్, మల్కాజిగిరి, ఖాజాగూడ ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.