రాష్ట్రంలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న

రాష్ట్రంలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న

హైదరాబాద్: వరద నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం.. రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర పంట, ఆస్తి నష్టం జరిగింది. వరదలతో హైదరాబాద్ లో చాలా ఇళ్లు కూలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది.

రెండు టీమ్ లుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని పరిశీలిస్తోంది కేంద్రబృందం. ముందుగా హఫీజ్ బాబా నగర్ లో పర్యటించిన సెంట్రల్ టీం..వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించింది. తర్వాత ఫూల్ బాగ్ లోని నల్లవాగు ప్రాంతాన్ని పరిశీలించింది. వరద గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు.  బాబానగర్ లో కేంద్ర బృందాన్ని కలిసి వరద పరిస్థితులను వివరించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.

తర్వాత గుర్రం చెరువును పరిశీలించిన అధికారులు..చెరువు ఎందుకు తెగిందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులను అడిగారు. చెరువు కట్టను ఎందుకు బలంగా నిర్మించలేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా చెరువు కట్ట బలంగా ఉండేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ తర్వాత పల్లె చెరువును పరిశీలించారు.

మరోవైపు  వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఇంకో టీమ్ పరిశీలిస్తోంది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలంలోని అంగడి కిష్టాపూర్, మార్కూక్ లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్ BRK భవన్ లో సీఎస్ సోమేశ్ కుమార్ తో సమావేశమైంది. వరదలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఫోటోల ద్వారా వరద నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు సీఎస్.