అఫ్గాన్‌ నుంచి వచ్చే వాళ్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

అఫ్గాన్‌ నుంచి వచ్చే వాళ్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ తాలిబన్ల గుప్పెట్లో చిక్కుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. తాలిబన్ల అరాచకాలకు గురి కాకుండా ఉండడం కోసం అక్కడున్న మన దేశ పౌరులను సేఫ్‌గా తరలించేందుకు భారత ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. అయితే అక్కడ చిక్కుకున్న మనవాళ్లతో పాటు అఫ్గాన్‌కు చెందిన మైనారిటీలను కూడా శరణార్థులుగా కాపాడి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ విమానంలో ఆదివారం ఉదయం 168 మందిని కాబూల్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. ఇందులో 107 మంది ఇండియన్స్ ఉండగా, మిగిలిన వాళ్లు అఫ్గాన్లు, ఇతర దేశాల వాళ్లు ఉన్నారు. అయితే ఈ క్రమంలో అన్ని రకాలుగా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మన దేశంలోకి పోలియో మహమ్మారి ప్రవేశించకుండా ఉండేందుకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

‘‘అఫ్గాన్‌ నుంచి వచ్చే వాళ్లందరికీ ఫ్రీగా పోలియో (OPV & fIPV) వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించాం. పోలియో మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న హెల్త్ సిబ్బందికి అభినందనలు” అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. కాగా, దేశంలో ఎన్నో ఏండ్లుగా సమర్థవంతంగా పోలియో వ్యాక్సినేషన్‌ చేపట్టడం ద్వారా భారత్ పోలియో రహిత దేశంగా నిలిచింది. అయితే ప్రపంచంలో ఇప్పటికీ పోలియో మహమ్మారి ఉన్న దేశాలు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లు మాత్రమే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి శరణార్థులుగా వస్తున్న వారికి ద్వారా మళ్లీ మన దేశంలో పోలియో ప్రవేశించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రత్యేకంగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతోంది.