ట్రేడ్ డీల్.. దేశ భవిష్యత్తును మార్చేస్తది : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ట్రేడ్ డీల్.. దేశ భవిష్యత్తును మార్చేస్తది : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
  •  
  •     ట్రంప్​తో మోదీకి ఉన్న స్నేహంతోనే మంచి డీల్ కుదిరింది
  •     దేశ ప్రయోజనాలను మోదీ పరిరక్షించారని వెల్లడి
  •     త్వరలోనే ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తామన్న మినిస్టర్

న్యూఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్ భారత ఉజ్వల భవిష్యత్తుకు ఒక శుభసూచకమని వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్ అన్నారు. ఈ ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చినందుకు ప్రధాని మోదీకి దేశమంతా అభినందనలు చెబుతోందని తెలిపారు. ఈ ఒప్పందంతో పేదలు, రైతులు, యువత, మత్స్యకారులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా.. పొరుగుదేశాలతో పోలిస్తే భారత్‌‌‌‌ మెరుగైన ఒప్పందాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘‘అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పార్లమెంటులో మాట్లాడదాం అనుకున్నాం. పార్లమెంటులో రాహుల్‌‌‌‌ గాంధీ  నేతృత్వంలోని కాంగ్రెస్ గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ ఒప్పందంపై దేశ ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. దేశాభివృద్ధిపై ఆయనకు పట్టింపు లేదు. ఈ ఒప్పందంలో దేశ వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ప్రధాని మోదీ పరిరక్షించారు. ట్రంప్‌‌‌‌తో ఉన్న సత్సంబంధాల కారణంగానే రెండు దేశాల మధ్య మంచి ఒప్పందం కుదిరింది” అని వెల్లడించారు.

ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్

ట్రేడ్ డీల్ ఒప్పందాన్ని ట్రంప్ మొదట ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శించడంతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా మాట్లాడారు. ‘‘భారత్‌‌‌‌ పై అమెరికానే  రెసిప్రోకల్​ టారిఫ్ లను విధించింది. కాబట్టి వాటిని తొలగిస్తున్నట్టు ప్రకటించాల్సింది కూడా వారే.  ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలను ఖరారు చేస్తున్నాం. అందుకు సంబంధించిన సంయుక్త ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తాం” అని పేర్కొన్నారు.