- ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణలో స్మారక కట్టడాల సంరక్షణకు సుమారు రూ. 37 కోట్లు రిలీజ్ చేసినట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఇందులో భాగంగా 2022–23లో రూ.15.50 కోట్లు, 2023–24లో రూ.14.38 కోట్లు, 2024–25లో రూ.6.80 కోట్లు కేటాయించగా రూ.6.77 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు సోమవారం లోక్ సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
అలాగే హృదయ్ పథకం కింద వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేయగా, 2018లో వెయ్యి స్తంభాల గుడి వద్ద టైల్ పార్కింగ్, లైటింగ్ సదుపాయాలు కల్పించారని చెప్పారు. 2022లో వరంగల్ కోట ఉత్తర ద్వారం, కుష్ మహల్, స్వయంభూ ఆలయ సముదాయం, కీర్తి తోరణం వద్ద ఫసాడ్ లైటింగ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, వరంగల్ లోని స్మారక కట్టడాల కోసం జాతీయ స్మారక చిహ్నాలు, పురావస్తు వస్తువుల మిషన్ (ఎన్ఎంఎంఏ) కింద ప్రత్యేక పథకాలు ఏవీ ప్రతిపాదించలేదని వెల్లడించారు
