భూమ్మీద మనిషి పుట్టినప్పటి నుంచి తిండి కోసం, బతుకు కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. ఇకపై ఆ అవసరం లేదంటున్నాడు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. అవును మీరు విన్నది నిజమేనండీ బాబు. పని చెయ్.. పైసా తీసుకో అనే పాత కాలపు ఫార్ములాకు కాలం చెల్లిపోయిందని ప్రపంచ కుబేరుడే చెబుతున్నాడు. భవిష్యత్తులో ప్రజలు అసలు పని చేయాల్సిన అవసరం లేదని.. అయితే వారి అకౌంట్లోకి మాత్రం ప్రతి నెలా 'ఫ్రీ మనీ' వచ్చి పడుతుందని చెబుతున్నాడు. మస్క్ చెబుతున్న ఈ యూనివర్సల్ హై ఇన్కమ్ బాంబ్ ఇప్పుడు ప్రపంచం అంతటా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు మస్క్ చెబుతోంది ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రోబోల రాజ్యం.. మనుషులకు విశ్రాంతి
ఏఐ, రోబోటిక్స్ ఎంత వేగంగా దూసుకుపోతున్నాయంటే.. త్వరలోనే డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. అత్యంత నైపుణ్యం కలిగిన సర్జన్ల అవసరం కూడా తగ్గిపోనుంది. టెస్లా కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ వంటి హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే వేగంగా, కచ్చితంగా పనులు పూర్తి చేస్తాయి. మరి మనుషుల పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు పోతే ఎలా బతకాలి? అనే ప్రశ్నలకు మస్క్ ఒక క్రేజీ సొల్యూషన్ ఇచ్చారు. అదే 'యూనివర్సల్ హై ఇన్కమ్'.
ప్రభుత్వాలే డబ్బులు పంచాలి..
ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే కోట్లాది మంది ప్రజలకు ప్రభుత్వాలే డబ్బు పంచాలని మస్క్ సూచిస్తున్నారు. రానున్న ఏఐ యుగంలో "ప్రభుత్వం చెక్కులు ఇస్తుంది.. జనం విలాసంగా బతుకుతారు" అనేది ఆయన వెర్షన్. గతంలో మనం విన్న యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కంటే ఇది ఒక అడుగు ముందే ఉంటుంది. అంటే కేవలం కనీస అవసరాలకే కాకుండా, గౌరవప్రదమైన జీవితం గడపడానికి సరిపడా ఆదాయం ప్రభుత్వాలే తమ ప్రజలకు ఇవ్వాలనేది మస్క్ వాదన.
ధరలు పెరగవా? ద్రవ్యోల్బణం రాదా?
సాధారణంగా ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు పంచితే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ మస్క్ లాజిక్ వేరు. రోబోలు పని చేయడం మొదలుపెడితే వస్తువులు, సేవల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరగవు, పైగా తగ్గుతాయి. కాబట్టి ప్రజల చేతిలో డబ్బు ఉన్నా మార్కెట్ స్థిరంగా ఉంటుందని అంటున్నారు ఈ అపర కుబేరుడు.
ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే ఏళ్ల తరబడి చదవాలి. కోట్లు ఖర్చు చేయాలి. కానీ ఏఐ రోబోలకు ఆ సమస్య లేదు. అత్యంత క్లిష్టమైన సర్జరీలను కూడా పర్ఫెక్ట్‌గా చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మస్క్ చెప్తున్నారు. ఏఐ అనేది ప్రభుత్వం చేసే చట్టాల కంటే 10 రెట్లు వేగంగా ఎదుగుతోందని.. అందుకే పాలసీలు మార్చడం కంటే నేరుగా ప్రజలకు డబ్బు పంచుతూ ఆర్థిక భరోసా ఇవ్వడమే బెస్ట్ ఆప్షన్ అంటున్నాడు మస్క్.
ఒకవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉన్నా.. మరోవైపు "పని లేని లోకం.. డబ్బున్న జనం" అనే మస్క్ కల వినడానికి అద్భుతంగా ఉంది. ఒకవేళ మస్క్ చెప్పినట్లు జరిగితే.. మనిషి కేవలం తనకి నచ్చిన పనులు చేస్తూ, సృజనాత్మకతతో బతికే సరికొత్త 'గోల్డెన్ ఏజ్' మొదలవుతుంది. అయితే ఈ ఫ్రీ మనీ సిస్టమ్ ఎలా సాధ్యం? ఏయే దేశాలు దీన్ని అమలు చేస్తాయి? అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఎలాన్ మస్క్ లాంటి వాళ్లకే ఇలాంటి వింత ఆలోచనలు వస్తుంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

