ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన కళ్యాణ్ సింగ్ అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన కళ్యాణ్ సింగ్ అంత్యక్రియలు

లక్నో: యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. సోమవారం లక్నో నగరంలోని అహిల్యాబాయ్ మోల్కర్ స్టేడియం నుంచి బులంద్ షహర్ లోని నరోరా టౌన్ బన్సీ ఘాట్ వరకు  కళ్యాణ్ సింగ్ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. కుమారుడు రాజ్ వీర్ సింగ్ చితికి నిప్పంటించి అంత్యక్రియలు జరిపించారు. కళ్యాణ్ సింగ్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు వీకే సింగ్, ప్రహ్లాద్ పటేల్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర నేతలు కళ్యాణ్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించి అంజలి ఘటించారు. 
కళ్యాణ్ సింగ్ తో తనక అనుబంధాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తు చేసుకున్నారు. కళ్యాణ్ సింగ్ మృతి దేశానికి, బీజేపీకి తీరని లోటన్నారు. ఆయన లోటు ఎవరూ తీర్చలేనిదని, రామ మందిర నిర్మాణానికి శంకుస్తాపన చేసినప్పుడు సంతోషించి తన జీవితాశయం నెరవేరిందని పొంగిపోయారని తెలిపారు. రామజన్మభూమి కోసం ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన ధన్యజీవి అని అమిత్ షా కొనియాడారు.