హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్

హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) గా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్  ఆరోపించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్  చీఫ్​ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదన్నారు. 2022 అక్టోబర్ లో తాను బీఆర్ఎస్ లో చేరినా.. గడపలోకి అడుగుపెట్టి అక్కడే వేచిచూస్తున్నట్లు ఉందని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని భాస్కర్  వెల్లడించారు. 

తనతో పాటు పార్టీలో చేరిన మహమ్మద్  మొయినుద్దీన్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు తీగల లక్ష్మణ్  గౌడ్  కూడా పార్టీని వీడుతున్నారని ఆయన చెప్పారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్  బయట మీడియాతో భాస్కర్  మాట్లాడారు. తాను బీఆర్ఎస్  లో చేరినప్పుడు కేటీఆర్  కప్పిన పార్టీ కండువాను హైదరాబాద్  తెలంగాణ భవన్ కు స్పీడ్ పోస్ట్ లో పంపుతానన్నారు. 

దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా కనిపించడాన్ని బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. అందుకే తెలంగాణను యూటీ చేయాలనే కుట్ర చేస్తోందన్నారు. ఇదే జరిగితే తెలంగాణ ఎండమావిగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర భౌగోళిక స్వరూపం పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తానన్నారు.