ఎం2 చిప్​ సిలికాన్ మ్యాక్ పవర్​తో రాబోతున్ననడిచే మ్యాక్​లు

ఎం2 చిప్​ సిలికాన్ మ్యాక్ పవర్​తో రాబోతున్ననడిచే మ్యాక్​లు

యాపిల్ ప్రొడక్ట్స్​ని వాడేవాళ్లకు గుడ్​న్యూస్. త్వరలోనే టెన్త్ జనరేషన్ ఐపాడ్​తో పాటు ఎం2 చిప్​ సిలికాన్ మ్యాక్ పవర్​తో నడిచే మ్యాక్​లు రాబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇమేజెస్​లో మార్పులతో ఇకపై ఐ క్లౌడ్ నుంచి ఫొటోలు పంపడం ఈజీ. అంతేకాదు ట్విట్టర్​లో రానున్న కొత్త ఫీచర్​తో  ఎవరుపడితే వాళ్లు ట్వీట్స్​లో మెన్షన్ చేయడం సాధ్యం కాదు. అలానే సెన్సిటివ్ కంటెంట్ 18 ఏండ్ల వయసు వాళ్ల కంటపడకుండా మరో ఫీచర్ తెస్తోంది ట్విట్టర్.​ ఇవేకాకుండా నెట్​ఫ్లిక్స్​లో ‘బేసిక్ విత్ యాడ్స్​’ ప్లాన్ వస్తోంది.  

ఈమధ్యే ఐఫోన్ 14, 14 ప్రో ఫోన్లు తీసుకొచ్చిన యాపిల్ త్వరలోనే కొత్త ఐపాడ్, ఐపాడ్ ప్రోతో పాటు రెండు మ్యాక్స్ తేనుంది.  ఒఎస్ 16.1 ఉన్న ఐపాడ్​ని అక్టోబర్ 24వ తారీఖున రిలీజ్​ చేయనుంది యాపిల్. అదేరోజు 11 ఇంచులు, 12.9 ఇంచుల సైజ్ ఉన్న రెండు  ఐపాడ్స్ ప్రో, ఎం2 చిప్ ఉన్న రెండు సిలికాన్ పవర్ మ్యాక్​లను కూడా తీసుకొస్తోంది యాపిల్. ఐపాడ్​లో యాపిల్ ఎ 14 బయోనిక్ చిప్​సెట్​తో పాటు యూఎస్​బి సి పోర్ట్ ఉంటుంది. వీటితో పాటు 14 ఇంచులు, 16 ఇంచుల సైజ్ ఉన్న మ్యాక్ ప్రోలను కూడా విడుదల చేయనుంది. 

ఐ క్లౌడ్ నుంచి ఈజీగా  

ఫొటోలు, వీడియోల్ని విండోస్ కంప్యూటర్, ఇతర ఫోన్లకు ఫొటోలు పంపించడం, లేదా వాటి నుంచి రిసీవ్​ చేసుకోవడంలో  ఇబ్బంది పడుతుంటారు యాపిల్ యూజర్లు. ఈ సమస్యకు సొల్యూషన్​గా..  విండోస్ కంప్యూటర్లు, ఎక్స్​బాక్స్ కన్సోల్స్​లో యాపిల్ యాప్స్, సర్వీస్​లని ఈజీగా వాడుకునేందుకు త్వరలోనే కొత్త అప్​డేట్(2022.31100.9001.0) రానుంది.  మైక్రోసాఫ్ట్ ఇమేజెస్​లో కొన్ని మార్పులతో ఉండే ఈ అప్​డేట్ వస్తే...  విండోస్ 11 కంప్యూటర్ నుంచి  లేదా ఎక్స్​బాక్స్ కన్సోల్​ నుంచి  ఐక్లౌడ్ ఫొటో లైబ్రరీకి ఈజీగా యాక్సెస్ కావొచ్చు. అంతేకాదు గ్యాలరీ వ్యూలో మిగతా ఫొటోలతో పాటు ఐ క్లౌడ్ ఫొటోలు కూడా కనిపిస్తాయి.  

యాప్ డెవలపర్స్​ కోసం..

యూజర్ల సెక్యూరిటీ, అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది యాపిల్. అందుకోసం యాప్​ డెవలపర్స్​కు ఐడియాలు ఇవ్వడమే కాకుండా‘ఆస్క్ యాపిల్’ ప్రోగ్రాం నడిపిస్తోంది యాపిల్. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి యాప్ యాక్స్​లేటర్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి  బెంగళూరులో ఉంది. యాప్​ డెవలపర్స్​కి యాపిల్ కొత్త ప్రొడక్ట్స్​ గురించి అవేర్​నెస్ ఇవ్వడం కోసం అక్టోబర్ 17 నుంచి 20వ తేదీ వరకు మొదటి దశ  ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అందులో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ‘ఆస్క్​ యాపిల్​’(Ask Apple) వెబ్​సైట్​లోకి వెళ్లి, యాపిల్ ఐడీతో లాగిన్ కావాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లు యాపిల్ ఇంజినీర్లతో మాట్లాడి, ఐఫోన్ 14 ప్రోలోని డైనమిక్ ఐలాండ్ ఫీచర్​ గురించి మరింత తెలుసుకోవచ్చు. యాపిల్ స్విఫ్ట్​ లాంగ్వేజ్​ని అర్థం చేసుకోవడమే కాకుండా స్విఫ్ట్ యుఐ  (యూజర్ ఇంటర్​ఫేస్ )కూడా నేర్చుకోవచ్చు. కొత్త ఓఎస్​, హార్డ్​వేర్​కి సరిపోయే యాప్స్ చేయడంలో కూడా యాపిల్ ఇంజినీర్ల సాయం తీసుకోవచ్చు. 

ట్వీట్స్​లో మెన్షన్ చేయకుండా..

ట్విట్టర్​లో ఫొటోలు, పోస్టులకు ఫ్రెండ్స్, తెలిసినవాళ్ల​ని ట్యాగ్ చేస్తుంటారు చాలా మంది. అంతేకాదు రిప్లయ్​, ట్వీట్స్​కు కూడా వాళ్లని మెన్షన్​ చేస్తుంటారు. దాంతో ప్రతిదానికి ‘అనవసరంగా మా పేరు మెన్షన్ చేస్తున్నార’ని అనుకుంటారు కొందరు. అయితే, ఇకపై ఎవరుపడితే వాళ్లు ట్వీట్లకు మెన్షన్​ చేయకుండా కొత్త ఫీచర్​ తేనుంది ట్విట్టర్. ఈ ఫీచర్ వస్తే.. వాట్సాప్​లో  స్టేటస్, లాస్ట్ సీన్ కొంత మందికే కనిపించేలా సెట్టింగ్స్​ మార్చుకోవచ్చు. అలానే  ట్విట్టర్​లో  కూడా యూజర్లు ఎవర్ని  మెన్షన్​ చేయాలో సెట్టింగ్ మార్చకోవచ్చు. అంతేకాదు బ్లాక్ చేసిన వాళ్లు ఇకపై మెన్షన్ చేయలేరు. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి - ఎవరైనా మెన్షన్ చేయొచ్చు, రెండోది- మీరు ఫాలో అవుతున్న వాళ్లు మాత్రమే మెన్షన్ చేయొచ్చు. 
ఎవరూ మెన్షన్ చేయొద్దు అనే ఆప్షన్ కూడా ఉంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుంది.

నెట్​ఫ్లిక్స్​లో కొత్త ప్లాన్ ​ 

ఈమధ్య సబ్​స్క్రయిబర్స్ బాగా తగ్గిపోవడంతో ఆదాయం పెంచుకునేందుకు ‘బేసిక్ విత్ యాడ్స్’​  ప్లాన్  తీసుకొస్తోంది నెట్​ఫ్లిక్స్. ఈ ప్లాన్ తీసుకున్న సబ్​స్క్రయిబర్స్ వీడియో చూస్తుంటే...​  ప్రతి గంటకు నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు యాడ్స్ వస్తాయి. ఈ ప్లాన్ నవంబర్​ 3 నుంచి  బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అందు బాటులోకి వస్తుంది. మిగతా ప్రీమియం ప్లాన్స్​లో ఏ మార్పులు లేవని చెప్పింది నెట్​ఫ్లిక్స్.  

సెన్సిటివ్ ట్వీట్స్​ ముసుగేయొచ్చు

సోషల్​మీడియాలో  అసభ్యకరమైన, హింసను ప్రేరేపించేలా ఉన్న ఫొటోలు,  పోస్ట్​లు, వీడియోలు పెడుతుంటారు కొందరు. ట్విట్టర్​లో కూడా ఇలాంటి సెన్సిటివ్ ట్వీట్స్​ చాలానే ఉంటాయి. దాంతో  అలాంటి ట్వీట్స్​ 18 ఏండ్లలోపు పిల్లలు చూడకుండా ఉండేందుకు కొత్త ఫీచర్ తెస్తోంది ట్విట్టర్. అందుకని సెన్సిటివ్ ట్వీట్స్, ఫొటోలు చూడాలంటే యూజర్లు  అకౌంట్​లో తమ పుట్టిన రోజు యాడ్ చేయాలి. దాంతో సెన్సిటివ్ ట్వీట్స్​ 18 ఏండ్లలోపు వాళ్ల కంటపడవు.