మేడిపల్లి, వెలుగు: మేడిపల్లిలోని ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న అదనపు కోర్టు హాళ్ల పనులను జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి బాలభాస్కర్ రావు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పెరుగుతున్న కేసుల దృష్ట్యా మౌలిక సదుపాయాల కల్పన అవసరమని, ఈ కొత్త గదులు అందుబాటులోకి వస్తేనే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులోగా భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జడ్జిలు కె. శ్రీకాంత్, బి. వీరన్నలతో పాటు మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

